హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆలం గౌస్ తనకున్న పవర్‌ను ఉపయోగించి ఇల్లీగల్ పనులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ సీపీ జల్సాలు ఎక్కువ అయ్యాయని, కుటుంబ సభ్యులతో బోనాలపల్లిలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.సీపీ చేసిన ఫైరింగ్‌లో అమృతమ్మ అనే వృద్ధురాలి తొడకు గాయమైందని, మంత్రి వివేక్‌కు చెందిన పత్రికలో మరుసటి రోజు ఈ వార్త వచ్చినట్టు తెలిపారు. ఫైరింగ్ రేంజ్లో పోలీసులు మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా.. సీపీ సతీమణి, స్నేహితులు ఇష్టం వచ్చినట్టు ఫైరింగ్ చేస్తున్నట్టు ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులపై ఉన్న కేసులను బయటకు తీయిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, సీపీ వ్యవహార శైలిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు తనపై కేసు పెట్టారని, ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుతున్నారని ఆధారాలతో బయటపెడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఒకరిద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుతో అందరికీ చెడ్డ పేరు వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మత మార్పిడిపై తాను ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
మహేశ్‌కుమార్ గౌడ్‌కు సవాల్
తమ నాయకుడు కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెడుతున్నారని పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చి పారిపోవడం కాదని, అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నారో తెలుస్తుందన్నారు. డ్రగ్ టెస్ట్‌తోపాటు మద్యం టెస్ట్ సైతం చేయాలని డిమాండ్ చేశారు.