బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం ఊరూరా సాగుతున్నది. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ పంపిణీ చేసి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతుండగా, అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఆచరణ సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కి మోసం చేసిన ‘హస్తం’ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలంటూ నాయకులు పిలుపు నివ్వగా, ప్రజానీకం సైతం సై అంటున్నది.
మంచిర్యాలటౌన్/లక్షెట్టిపేట/హాజీపూర్,/భీమారం/కోటపల్లి/సీసీసీ నస్పూర్/దండేపల్లి,అక్టోబర్13 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ రాంనగర్ ఏరియాలో సోమవారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని ధ్వజమెత్తారు. 420 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నాయకుల తీరుతో విసుగెత్తి పోయారన్నారు. ఆయా పథకాల కింద బాకీ పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ సర్పంచ్ వేల్తపు సుధాకర్, మాజీ ఎంపీటీసీ కోన తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ కోన శ్రీనివాస్, ధనిశెట్టి మల్లేశ్, అంకతి గంగాధర్, మండే గణపతి, వేల్తపు శ్రీను పాల్గొన్నారు.
హాజీపూర్ మండల కేంద్రంతో పాటు సబ్బపెల్లి గ్రామాల్లో మాజీ సర్పంచ్ ఆకుతోట సత్తమ్మ, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులకు ఆకుతోట సత్తయ్య, సోగాల కిష్టయ్య, ఆసాధి ప్రవీణ్ పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. భీమారం మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్ ఉన్నారు. కోటపల్లి మండలం బబ్బెరచెలుక జీపీ పరిధిలో కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆసంపెల్లి సంపత్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఆసంసెల్లి దుర్గుమల్లయ్య, బాపు, తిరుపతి, నగేశ్, రాజేశ్వర్, యోగానంద్, వెంకట్, అజయ్ ఉన్నారు.
నస్పూర్కాలనీలోని సింగరేణి కార్మిక వాడల్లో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి నాయకులతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఇంటింటికీ, షాపుల వెంట తిరుగుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ బాకీ కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
కార్యక్రమంలో యూనియన్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శులు పానుగంటి సత్తయ్య, వెంగల కుమారస్వామి, అన్వేష్‌రెడ్డి, తీగల వెంకట్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ఆకునూరి సంపత్‌కుమార్, పెరుమాళ్ల జనార్ధన్, అడ్లకొండ రవిగౌడ్ పాల్గొన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. మాజీ ఏఎంసీ డైరెక్టర్ మీర్జా అఫ్సర్ బేగ్, బీఆర్ఎస్ నాయకుడు శ్రావణ్, తదితరులు ఉన్నారు.