ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి రాజ్యమేలుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. నిరుపేదల నుంచి పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్టు బయటపడుతున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నుంచే డబ్బులు తీసుకొని అనర్హులకు ఇండ్లు ఇచ్చారనే ఆరోపణలు రాగా.. ఇప్పుడు బిల్లుల విషయంలో పంచాయతీ కార్యదర్శులు వసూళ్లకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. వీరితోపాటు ఇంటి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇంజినీరింగ్ అధికారులపైనా ఆరోపణలు వస్తున్నాయి. హస్తం పార్టీ నాయకులు కూడా దళారుల అవతారమెత్తి, సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల లక్ష బిల్లు చెల్లింపు కోసం లబ్ధిదారు నుంచి 10వేలు లంచం తీసుకుంటూ మధురానగర్ కార్యదర్శి ఏసీబీకి చిక్కడం అవినీతికి అద్దం పట్టగా, లబ్ధిదారులు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని, అవినీతికి తావులేకుండా చూడాలని కోరుతున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. కానీ, ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇందిరమ్మ పేరిట ప్రారంభించిన గృహ నిర్మాణ పథకంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులతోపాటు గృహ నిర్మాణ ఇంజినీరింగ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇండ్ల బిల్లుల చెల్లింపులో కక్కుర్తి పడుతూ రాష్ట్రంలో అక్కడక్కడ ఏసీబీ అధికారులకు చిక్కుతుండగా, నాలుగు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో మధురానగర్ కార్యదర్శి పట్టుబడడం అవినీతికి అద్దం పట్టింది. నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలో ఒక్కో దశలో కొందరు కార్యదర్శులు 5 వేల నుంచి 10 వేలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక్కో దశలో లక్ష చొప్పున బిల్లులు చెల్లిస్తుండగా, లక్షకు ఇంత అంటూ డిమాండ్ చేస్తుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే బిల్లులు ఆలస్యమవుతుండగా, అడిగినట్టు లంచాలు ఇవ్వకుంటే బిల్లులు ఆగుతాయని భయపడుతున్నారు.
దళారులుగా ‘హస్తం’ పార్టీ నేతలు?
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో గ్రామంలో 20కి మించి ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆది నుంచే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో విమర్శలు వస్తున్నాయి. ఇండ్లు మంజూరు చేయడానికే హస్తం పార్టీ నేతలు వసూళ్లు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఇండ్ల నిర్మాణం మొదలు కాగా, బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొన్నిచోట్ల కొనసాగుతున్నది. ఇదే సమయంలో దళారుల అవతారం ఎత్తి, కింది నుంచి పైస్థాయి వరకు ముట్టజెప్పాలని ముందుగానే లబ్ధిదారులను ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
అన్నీ సరిగ్గా ఉన్నా ఏదో ఒక వంక పెట్టి బిల్లులు ఆపుతున్నట్టు సమాచారం. లంచాలు ఇచ్చిన వారికి మాత్రం త్వరగా బిల్లులు వస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లకు ఎవరి వాటా వారికి ఇప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ పంచాయతీ కార్యదర్శి లక్ష బిల్లు కోసం 10వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరకగా, పట్టించిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడనే తెలుస్తున్నది. అతను కూడా కొందరు లబ్ధిదారుల నుంచి కార్యదర్శికి పెద్ద మొత్తంలోనే లంచాలు వసూలు చేసి ఇచ్చినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.
తనదాకా వస్తేగానీ తెలియదన్నట్టు.. తన ఇంటి బిల్లు చెల్లించేందుకు కూడా కార్యదర్శి లంచం డిమాండ్ చేయడంతో సదరు నాయకుడు ఏసీబీని ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. కొన్నిచోట్ల కార్యదర్శులే నేరుగా లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కింది నుంచి మీది వరకు ఇవ్వాల్సి ఉంటుందని లబ్ధిదారుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇల్లు త్వరగా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే లబ్ధిదారులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది.
మంజూరు నుంచి ఇదే కథ!
ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైన తర్వాత కొందరు హస్తం పార్టీ నాయకులది ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అయిందనే విమర్శలున్నాయి. దరఖాస్తుదారుల నుంచి అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాతనే ఇండ్లు మంజూరు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ఆయా గ్రామాల్లో అర్హులకు అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్పట్లో ఎంతో మంది రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. డబ్బులు తీసుకొని అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారంటూ ఇందిరమ్మ కమిటీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.
అయినా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇటు కొందరు నాయకులైతే ఏకంగా కాంట్రాక్టర్ల అవతారం కూడా ఎత్తారు. ఇంటి నిర్మాణం తనకు అప్పగిస్తే ఇల్లు మంజూరు చేయిస్తానని ముందుగానే అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ద్వారా వచ్చే 5 లక్షలకు అదనంగా 2 లక్షల నుంచి 3 లక్షలు చెల్లిస్తే పూర్తి ఇల్లు కట్టించే బాధ్యత తమదేనని చెప్పుకోవడమే కాదు, కొన్ని గ్రామాల్లో ఇదే మాదిరిగా ఇండ్ల నిర్మాణం చేపట్టినట్టు అక్కడక్కడా లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఇండ్లు వచ్చిన తర్వాత కొందరు తామే నిర్మించుకుంటామంటే సదరు లబ్ధిదారుల ఇండ్లు కూడా రద్దు చేయించినట్టు సమాచారం. ఇండ్ల విషయంలో ఈ విధంగా అవినీతి రాజ్యమేలుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మాత్రం అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పేద, మధ్యతరగతి వర్గాల కోసం తెచ్చిన ఈ పథకాన్ని పక్కగా అమలు చేయడంతోపాటు అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరమున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.