ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లకు ముందే ధాన్యం నీటమునగడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. కట్టంగూర్ మండంలోని ఈదులూరు, నారెగూడెం, కురుమర్తి, కట్టంగూర్, అయిటిపాముల, పందనపల్లి, గార్లబాయిగూడెం, పరడ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాసులు తడిసిముద్దయ్యాయి. అలాగే శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం నీట మునిగింది. శాలిగౌరారం మార్కెట్ యార్డులో రైతులు విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో వరిపైరు నేలవాలింది.
చౌటుప్పల్ మార్కెట్ యార్డులోని ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ధాన్యం కుప్పల చుట్టూ వాన నీరు చేరింది. కనీసం అరబెట్టేందుకు కూడా వీలు లేకుండా ధాన్యం కుప్పల వద్ద నీరు నిలిచింది. పలు గ్రామాల్లో వరి, పత్తి పంటలు నీటి మునిగాయి. పెద్దకొండూరులో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గ్రామం నీట మునిగింది. గ్రామంలోని వీధులన్నీ జలమయం కావడంతో గ్రామస్తులు తెల్లవార్లు జాగారం చేశారు. పెద్దకొండూరు,నక్కలగూడెం,మల్కాపురం చెరువులు అలుగు పారుతున్నాయి. నక్కలగూడెం గ్రామానికి చెందిన యాస యాదిరెడ్డి కోళ్ల ఫారం నీట మునగడంతో సుమారు ఆరువేల కోళ్లు చనిపోయాయి. దీంతో తనకు రూ. ఆరు లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కట్టంగూర్, అక్టోబర్ 13: ఆదివారం రాత్రి నుం చి సోమవారం ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఈదులూరు, నారెగూ డెం, కురుమర్తి, కట్టంగూర్, అయిటిపాముల, పందనపల్లి, గార్లబాయిగూడెం, పరడ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాసులు తడిసిముద్దయ్యాయి. అదివారం సాయంత్రం రైతులు ధాన్యాన్ని రాసులు పోసుకోకపోవడంతో ఆకాల వర్షం కారణంగా తడిసిపోయింది.
శాలిగౌరారంలో తడిసిన ధాన్యం..
శాలిగౌరారం, అక్టోబర్ 13: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం నీట మునిగింది. తడిసిన ధాన్యాన్ని ఎత్తుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రైతులు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం రాశులు తడిసి పోయాయి. వరద తాకిడికి ధాన్యం కొట్టుకుపోయింది. అదేవిధంగా పలు గ్రామాల్లో వరి పైరు నేలవాలింది.
చౌటుప్పల్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం..
చౌటుప్పల్, అక్టోబర్ 13 : చౌటుప్పల్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ మార్కెట్ యార్డులోని ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ధాన్యం కుప్పల చుట్టూ వాన నీరు చేరింది. కనీసం ఆరబెట్టేందుకు కూడా వీలు లేకుండా ధాన్యం కుప్పల వద్ద నీరు నిలిచింది. దీంతో నీటిని తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పలు గ్రామాల్లో వరి, పత్తి పంటలు నీటి మునిగాయి.
భారీ వర్షంతో నీటమునిగిన పెద్దకొండూరు
చౌటుప్పల్‌రూరల్, అక్టోబర్ 13: చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గ్రామం నీట మునిగింది. గ్రామంలోని వీధులన్నీ జలమయం కావడంతో గ్రామస్తులంతా తెల్లవారేవరకు జాగా రం చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇండ్లు పూర్తిగా నీట మునిగి పొయాయి. గ్రామానికి చెందిన పలువురి ఇండ్లలోని దుస్తులు, ఫర్నిచర్ పూర్తిగా తడిసిపోయాయి. రాత్రి నుంచి గ్రామస్తులు జేసీబీలతో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. నక్కలగూడెం గ్రామానికి చెందిన యాస యాదిరెడ్డి కోళ్ల ఫారం నీట మునగడంతో సుమారు ఆరువేల కోళ్లు చనిపోయాయి.
నార్కట్‌పల్లిలోని పలు గ్రామాల్లో తడిసిన ధాన్యం
నార్కట్‌పల్లి అక్టోబర్ 13: మండలంలో సోమవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెడుతూ వచ్చి టార్పాలిన్లు కప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభ త్సం సృష్టించడం తో ధాన్యం నీటి పాలైంది.
ఆత్మకూరు(ఎం) మండలంలో..
ఆత్మకూరు(ఎం), అక్టోబర్13 : మం డలంలోని కూరెళ్ల, లింగరాజ్‌పల్లి గ్రామా ల్లో సోమవారం తెల్లవా రు జామున 3గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి నీటిలో కొట్టుకుపోయాయి. లింగరాజ్పల్లిలో 9 మంది రైతుల ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. కూరెళ్లలో వరదనీరు ఇండ్లలోకి వచ్చి చేరడంతో పాటు మూసీ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తిప్పర్తి మండలంలో..
తిప్పర్తి,అక్టోబర్13: మండల వ్యాప్తంగా ఆదివా రం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా నేటికీ కొనుగోలు కేంద్రాలను మం డల వ్యాప్తంగా ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నల్లగొండ జిల్లాలో 32.9 మి.మీ వర్షపాతం
నల్లగొండ, అక్టోబర్ 13: జిల్లాలో 32.9 మి.మీ వర్షపాతం నమోదైంది.నార్కట్ పల్లిలో 78.9, అనుములలో 76.6, మాడ్గులపల్లిలో 59.2, దేవరకొండలో 58.8, కొండమల్లే పల్లిలో 56.5, కనగల్‌లో 55.8, పెద్దవూరలో 52.6, మునుగోడులో 50.8, నిడమనూరులో 41.2, పీఏ పల్లిలో 37.6, గుర్రంపోడ్లో 35.6, గట్టుప్పుల్లో 34.8, తిరుమలగిరి సాగర్‌లో 34.5, గుడిపల్లిలో 33.8, వేముల పల్లిలో 32.2, మిర్యాలగూడలో 31.9, నాంపల్లిలో 31.6 త్రిపురారంలో 31.8, చిట్యాలలో 30.0, చండూర్లో 29.6, చింతపల్లిలో 27.7, శాలిగౌరారంలో 25.0, తిప్పర్తిలో 23.2, కట్టంగూర్‌లో 19.4, మర్రిగూడలో 19.4, కేతెపల్లిలో 17.6, గుండ్లపల్లిలో 16.6, దామరచర్లలో 16.0, నేరేడుగొమ్ములో 13.8, నకిరేకల్‌లో 13.7, నల్లగొండలో 12.7, చందంపేటలో 11.1, అడవిదేవుల పల్లిలో 5.6, మొత్తంగో 1085.2 పడగా, 32.9 మి.మీ.సగటు వర్షపాతం నమోదైంది.
నీటిపాలైన ధాన్యం
యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ)/మోత్కూరు, అక్టోబర్ 13 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అన్నదాతకు తీరని శాపంలా మారింది. రెక్కలు ముక్కలుచేసుకొని పండించి రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడిన ధాన్యం ప్రభుత్వ అలసత్వంతో వర్షార్పణ మైంది. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పత్తి, వరి పంట నీటిమునిగింది. మరోవైపు భారీ వర్షాలతో పలు చోట్ల ఇండ్లలోకి నీరు చేరగా, మరికొన్ని చోట్ల ఇండ్లు ధ్వంసమయ్యాయి.
ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవా రం ఉదయ వరకు వానలు దంచికొట్టాయి. పలు చోట్ల నిరంతరాయంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం వరకు కూడా చల్లని వాతావరణం నెలకొంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జిల్లా లో అనేక చోట్ల పంట చేతికి వచ్చింది. ఇటీవల వర్షానికి చౌటుప్ప ల్ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసింది. జిల్లాలో సోమవారం ఉద యం వరకు ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. కాగా ధాన్యం తడవడంతో సోమవారం ఎమ్మెల్యేలతో ఒకటి రెండు చోట్ల హడావుడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం విశేషం.
వడ్లు వర్షార్పణం..
భారీ వర్షాలకు వలిగొండ, రామన్నపేట, ఆత్మకూరు, మోత్కూ రు, చౌటుప్పల్, అడ్డగూడూరు మండలాల్లో ధాన్యం తడిసింది. వలిగొండ మండలంలో ధాన్యం నీటమునిగింది. స్థానిక మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయిం ది. ఇదే మండలంలోని గుర్నాథ్ పల్లి, నాగారం, గోపరాజుపల్లి తదితర గ్రామాల్లో వడ్లు తడిసి రైతులు నష్టపోయారు. ఆత్మకూరు (ఎం)మండలంలోని కూరెళ్లలో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మోత్కూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్‌తోపాటు పాటిమల్ల, దాచారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసిన ధాన్యం వరదపాలైంది. రాశుల చుట్టూ నీరు చేరడంతో ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పత్తి చేలల్లో నీరు చేరి పత్తి జాలు వారింది. రామన్నపేట మండలంలోని దుబ్బాక, మునింపంపుల, నిదానపల్లి, పల్లివాడ గ్రామాల్లో వర్షంలో ధాన్యం కొట్టుకుపోయింది.