కట్టంగూర్, అక్టోబర్ 13 : అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పారంభంలోనే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కట్టంగూర్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఈదలూరు, నారెగూడెం, కురుమర్తి, కట్టంగూర్, అయిటిపాముల, వందనపల్లి, గార్లబాయిగూడెం, పరడ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో గల ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయినట్లు పలువురు రైతులు అవేదన వ్యక్తం చేశారు.
ఈదులూరులో రైతులు గాజుల శ్రీను, వెంకన్న, వేణుగోపాల చారి, వీరయ్యకు చెందిన ధాన్యం రాశులు నీటిలో కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. తడిచిన ధాన్యాన్ని అరబెట్టడానికి, ధాన్యం రాశులు తిరగబోయడానికి తగిన స్థలం లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కేంద్ర నిర్వాహకులు కొనుగోళ్లను ప్రారంభించి కాంటాలను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.