పెన్పహాడ్, అక్టోబర్ 13 : వర్షం వస్తుందంటేనే ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని గడుపుతున్నారు. వర్షపు నీటితో అతలాకుతలమై ముంపు ప్రాంతాలు మూసుకుపోవడంతో వరద నీటి నిల్వతో మురికి కూపాలుగా మారిన ప్రదేశాలను చూసి భయపడుతూ జీవనం సాగిస్తున్నారు. దోమలు విపరీతంగా వ్యాప్తి చెంది విష జ్వరాలు వ్యాప్తి చెందుతాయేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో. ప్రతిరోజు కురుస్తున్న వర్షపు నీరు నిల్వ ఉండడంతో వీధులు జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. వాటి గుండా ప్రయాణించాలంటేనే ప్రయాణికులు, బాటసారులు, గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మరి ముఖ్యంగా ప్రధాన గ్రామంలోకి వెళ్లే సీసీ రోడ్డు మోకాలు లోతు వర్షపు నీటితో నిండి భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ రహదారి వెంట ప్రయాణం చేస్తున్న స్థానికులు ఈ మురికి కూపంలో పడి అనేకమార్లు గాయాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ముంపు ప్రాంతాలను కొందరు వారి స్వార్థం కోసం మూసివేయడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక ఒక్కచోటనే చేరి దుర్గంధం వెదజల్లుతుంది. కాగా గతంలో ప్రభుత్వ పాఠశాల నుండి మాజీ సర్పంచ్ ఇంటి వరకు ప్రణాళిక లేకుండా నిర్మించిన డ్రైనేజ్ కాల్వ నిరుపయోగంగా మారింది. ఈ వర్షం నీరు సుమారు 50 గృహాల్లోకి, సంపుల్లోకి, బాత్రూంలోకి చేరి స్థానిక ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. మోకాలు లోతు నీళ్లలో బయటికి వెళ్లలేక, ఇంట్లోనే ఉండలేక అవస్థలు పడుతున్నారు. కనకదుర్గమ్మ దేవాలయం వద్ద గల సీసీ రోడ్డుపై కూడా వర్షపు నీరు నిలిచి గుంతలమయంగా మారి అసలు గ్రామంలోకి వెళ్లాలంటేనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు రహదారి కనిపించక గ్రామాన్ని తిట్టుకుంటూ వెళ్తున్నారు.
అదేవిధంగా మేడారం వైపు వెళ్లే రహదారి ఈ వర్షపు నీటికి గుంతల మాయంగా మారి కనిపించని గుంతలతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. సమస్య ఇంత విపరీతంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం, కనీసం గ్రామాన్ని సందర్శించకపోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. ఈ గ్రామ ప్రజల అవస్థలు అధికారులకు పట్టవా అని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను మండల, జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పరిశీలించి పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.