పాట్నా: కుటుంబంతోపాటు ఆర్జేడీ నుంచి విడిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Bihar Elections) ఈసారి మహువా స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన జనశక్తి జనతాదళ్ (జేజేడీ) అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించింది. జేజేడీ జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వైశాలి జిల్లాలోని మహువా నియోజకవర్గం నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ యాదవ్ మీడియాకు తెలిపారు. మొదటి జాబితాలోని ఇతర అభ్యర్థుల పేర్లను కూడా ఆయన వెల్లడించారు.
కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో హసన్పూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా తేజ్ ప్రతాప్ యాదవ్ గెలిచారు. అయితే పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన ఆయన జనశక్తి జనతాదళ్ (జేజేడీ)ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 2015 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన, తన బలమైన నియోజకవర్గం మహువా నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 16న నామినేషన్ దాఖలు చేస్తారు.
మరోవైపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలో తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఐదు ప్రాంతీయ పార్టీలతో కలిసి కొత్త కూటమిని ఆయన ఏర్పాటు చేశారు. వంచిత్ వికాస్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ), భోజ్‌పురియా జన్ మోర్చా (బీజేఎం) కూడా ఈ కూటమిలో ఉన్నాయి. కాగా, బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read:
Sonia Gandhi | వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ
Akhilesh Yadav | యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపండి: అఖిలేష్ యాదవ్
Watch: రైల్వే ట్రాక్ దాటుతుండగా బైక్ పైనుంచి పడిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?