ఖమ్మం సిటీ, మార్చి 2 : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసి ఇంటిల్లిపాదికి నిలువ నీడ లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. వంట సామగ్రి, ఇతర వస్తువులన్నింటినీ మూటగట్టి ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో మూలకు పడేసింది. దీంతో బుక్కెడు బువ్వ కోసం అల్లాడుతున్న అభాగ్యులకు బీఆర్ఎస్ ఆపన్నహస్తం అందించింది. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనాలు వడ్డిస్తూ బీదల ఆకలి తీరుస్తోంది.
ముందుకొచ్చిన ‘వద్దిరాజు’
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సౌజన్యంతో భోజనాలు వండి వడ్డిస్తున్నారు. ఆయనతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సైతం మధ్యలో ఒకపూట తనవంతుగా భోజనాలను పంపారు. సోమవారం ఉదయం 11గంటలకు ఆర్జేసీ విద్యాసంస్థల చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుండాల కృష్ణ భోజనాలను వడ్డించారు. ఆ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కేఎంసీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు.
‘పువ్వాడ’ సౌజన్యంతో భోజనాలు..
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశానుసారం పువ్వాడ ఫౌండేషన్, ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు దేవభక్తిని కిషోర్, మాటేటి కిరణ్, ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, దయాకర్, వీరేందర్, వెంకట్, తిరుమల్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.