హైదరాబాద్ : రాష్ట్ర ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత విషయాలపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ( Kranthi Kiran ) అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇప్పటికే రెండున్నర పదవికాలం మొత్తం ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం, దూషణలతో కాలం గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇంకెన్నాళ్లు చౌకబారు డైవర్షన్ రాజకీయాలు ( Diversionary politics ) చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువును ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా క్షుద్ర పూజలు అంటూ కల్లిబొల్లి మాటలు చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ మంత్రులు, అగ్రనాయకులు గుళ్లకు పోవడం లేదా? అంటూ నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గుళ్లకు పోయి పూజలు చేయలేదా. అప్పుడు కేసీఆర్ పతనం కావాలని పూజలు చేశారా? నీళ్లు రావద్దు. కరువు కాటకాలు రావాలని పూజలు చేశారని ఏనాడు తాము అనుమానం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నారని, తాగునీరు , కరెంటు సమస్యను ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో రోడ్డు సరిగా లేవని, యూరియా యాప్‌తో రైతులను ఇబ్బందులపాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని నిలుపుదల చేశారని విమర్శించారు.