Sivakarthikeyan | తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్‌తో తన సినిమా ఆగిపోవడంపై వస్తున్న వార్తలు, తన తండ్రి గంగై అమరన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించాడు. శివకార్తికేయన్ 27వ సినిమా కోసం ముందుగా వెంకట్ ప్రభునే దర్శకుడిగా ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్లో ‘పార్కింగ్’ చిత్ర దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఈ కొత్త చిత్రంతో పాటు ‘సెయోన్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వెంకట్ ప్రభు తండ్రి, సంగీత దర్శకుడు గంగై అమరన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కుమారుడి దర్శకత్వ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ఒక నటుడే కారణమని, ఆ ప్రాజెక్ట్ తీసుకోవద్దని తాను ముందే వెంకట్ ప్రభుకు సలహా ఇచ్చానని గంగై అమరన్ పేర్కొన్నారు. ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినా, నెటిజన్లు మాత్రం ఆ నటుడు శివకార్తికేయనే అంటూ పెద్దఎత్తున చర్చ మొదలుపెట్టారు. గతంలో వీరు కలిసి అమెరికాలో వీఎఫ్ఎక్స్ పనుల కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేయడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఈ వివాదంపై సోమవారం నాడు స్పందించిన వెంకట్ ప్రభు, తనకూ శివకార్తికేయన్‌కు మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. శివకార్తికేయన్ తనకు మంచి స్నేహితుడు మరియు తమ్ముడి లాంటివాడని తెలిపారు. కొడుకు సినిమా ఆలస్యం కావడంతో ఒక తండ్రిగా కలిగిన సహజమైన ఆవేదనతోనే తన తండ్రి అలా మాట్లాడి ఉంటారని, పూర్తి పరిస్థితులు తెలియక ఆయన అలా స్పందించి ఉండవచ్చని పేర్కొన్నారు. తాను తన వృత్తిపరమైన విషయాలను ఎవరితోనూ, చివరికి తన తండ్రితో కూడా ఎక్కువగా చర్చించనని, కేవలం కొన్ని కారణాల వల్లే ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదని చెప్పారు.
అయితే భవిష్యత్‌లో సరైన కథ కుదిరితే శివకార్తికేయన్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని వెంకట్ ప్రభు వెల్లడించారు. విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) చిత్రంలో వీరిద్దరూ కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనవసరమైన ఊహాగానాలకు స్వస్తి పలకాలని, తన తమ్ముడు శివకార్తికేయన్ కొత్త సినిమా ‘సెయోన్’ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.