Allu Arjun | పండుగల సమయంలో ధ్వని కాలుష్యంపై టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. అర్ధరాత్రి వేళల్లో భారీ శబ్దాలతో డీజేలు, లౌడ్ స్పీకర్లు వినియోగించడంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ వ్యవహారాన్ని కొందరు నెటిజన్లు అల్లు అర్జున్‌తో ముడిపెట్టడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలోని అపర్ణ వన్ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న అల్లు శిరీష్.. సమీపంలోని వినోభా నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో డీజేలు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 2 నుంచి 3 గంటల వరకు కూడా శబ్దాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు ఓపిక పట్టామని, అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వేళల్లో పెద్ద శబ్దాలు కొనసాగడంతో సమస్యగా మారిందని శిరీష్ తన పోస్టులో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. శిరీష్ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించారు. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఆ శబ్దాలకు స్థానిక ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా బయటి వ్యక్తులు మైకులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడి కార్యక్రమాన్ని నిలిపివేయించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ వ్యవహారాన్ని కొందరు నెటిజన్లు మతపరమైన అంశంగా మార్చడంతో శిరీష్ మరోసారి స్పందించారు. తాను కూడా హనుమంతుడి భక్తుడినేనని చెబుతూ.. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో డీజేలు పెట్టడం భక్తికి సంబంధించిన విషయం కాదని, ఇది పూర్తిగా పౌర బాధ్యత, ఇతరుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశమని స్పష్టం చేశారు. ఇక్కడితో వివాదం ముగియకుండా.. కొందరు నెటిజన్లు శిరీష్ వ్యాఖ్యలను అల్లు అర్జున్‌కు ముడిపెట్టడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అల్లు అర్జున్ పాత ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా కోకాపేట్‌లోని ఏఏఏ సినిమాస్ చుట్టుపక్కల ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావిస్తూ.. అక్కడ జరిగే కార్యక్రమాలు, సినిమాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి.
గతంలో ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను కూడా కొందరు ఈ చర్చలోకి తీసుకొచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ విమర్శలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఉన్న నిబంధనలను ప్రస్తావిస్తూ.. ధ్వని కాలుష్యంపై శిరీష్ చేసిన ఫిర్యాదును వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌కు ఆపాదించడం సరికాదని వారు అంటున్నారు.