Kuwait | కువైట్ సిటీ, ఆగస్టు 15: కువైట్లోని భారతీయ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కువైట్లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో కువైట్లో భారత రాయబారి పరమిత త్రిపాఠి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించగా.. కార్యక్రమ ప్రాంగణం దేశభక్తి భావంతో మార్మోగింది. అనంతరం భారత రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని రాయబారి పరమిత త్రిపాఠి చదివి వినిపించారు. ఈ సందర్భంగా భారతదేశ గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రస్తావించారు. తెలుగు సాహిత్యానికి విశిష్ట స్థానం కల్పిస్తూ మహాకవి గురజాడ అప్పారావు రచించిన ప్రసిద్ధ దేశభక్తి గీతంలోని ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే భావాన్ని రాయబారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు కవి గురజాడ అప్పారావు సందేశాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై గుర్తుచేయడం తెలుగు ప్రవాసులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.
అలాగే కువైట్లో నివసిస్తున్న భారతీయులు స్థానిక చట్టాలు, నిబంధనలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా మెలగాలని రాయబారి సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని, కువైట్ సమాజంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ సంతోషకరమైన జీవనం సాగించాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించాయి. చిన్నారులు, మహిళలు, కుటుంబాలతోపాటు వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


