Iran-Qatar : తమ సైన్యానికి చెందిన ముగ్గురు పైలట్లను ఖతార్ బంధించిందని, వారిని వెంటనే విడిచిపెట్టాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖతార్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఇరాన్ ఆరోపణలను ఖతార్ ఖండించింది. తాము పైలట్లను బంధించలేదని, ఈ ప్రచారంలో నిజం లేదని పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడి చేశాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా సైనిక బేస్ కలిగిన ఇతర గల్ఫ్ దేశాలపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
దుబాయ్, యూఏఈ, సౌదీ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో ఖతార్‌లోని అమెరికా బేస్‌లపై ఇరాన్ వైమానిక దాడులకు దిగింది. యుద్ధ విమానాలతో దాడి చేసింది. అయితే, ఖతార్‌లోని అమెరికా సైన్యం ఈ విమానాల్ని కూల్చివేసింది. ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు, విమానాల నుంచి దూకి తమనుతామ రక్షించుకున్నారని ఇరాన్ చెబుతోంది. అయితే, ఖతార్ భూభాగంలో దిగిన ముగ్గురు పైలట్లను ఆ దేశం బంధించిందని ఇప్పుడు ఇరాన్ ఆరోపిస్తోంది. నెలలు గడుస్తున్నా వారిని తమకు అప్పగించడం లేదని చెబుతోంది. ఇరాన్‌కు చెందిన ఎస్‌యూ-24 విమానాల్ని ఖతార్ కూల్చివేయడంతో, ఆ విమానాల్లోని జావేద్ సలేహి, అబ్దోల్మాజిద్ దష్తియన్, ఒమ్రన్ బెహ్రవేషియన్ అనే ముగ్గురు పైలట్లు ఖతార్ సైన్యానికి చిక్కారని, వారిని విడిచిపెట్టాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
అయితే, ఇరాన్ వాదనను ఖతార్ కొట్టేసింది. తమ వద్ద ఇరాన్ సైనికులు ఎవరూ లేరని చెబుతోంది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. తాము విమానాలు కూల్చిన ఘటనలో సైనికుల కోసం పూర్తి స్థాయిలో సోదాలు, సహాయక చర్యలు చేపట్టామని వివరించింది. అయితే, తమకు ఏ ఒక్క సైనికుడు కూడా దొరకలేదని చెప్పింది. ఇదే సమయంలో ఒక సైనికుడికి సంబంధించిన అస్తికల్ని గతంలోనే ఇరాన్‌కు అందజేశామని పేర్కొంది. అంతేకాదు.. ఈ ఆరోపణలు గతంలోనే వచ్చాయన్నారు. అప్పుడు ఇరాన్‌కు ఒక ప్రతిపాదన పంపినట్లు పేర్కొన్నారు. ఇరాన్ అధికారులు, ఖతార్‌లో పర్యటించి, పూర్తిస్థాయి సోదాలు జరుపుకోవచ్చని చెప్పామన్నారు.
కానీ, ఈ అంశంపై ఇరాన్ ఇంకా స్పందించలేదని చెప్పారు. ఇరాన్.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. ఈ విషయంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నా.. ఇరు దేశాలు తమ వాదనకు కట్టుబడి ఉన్నాయి.