అంబర్‌పేట, మార్చి 2: అంబర్‌పేటలోని ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహ త్యకు కారకులైన నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీసీపీ రక్షిత కే.మూర్తి వెల్లడించారు. ఫిబ్రవరి 24న అంబర్‌పేటలో నివాసముండే హోటల్ వ్యాపారి కడ్గేకర్ రాంరాజ్(54), అతని భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయిఏ రాంరాజ్ మల్లాపూర్‌లో కింగ్స్ బిర్యాని హోటల్‌ను నడిపిస్తుండేవాడు.
హోటల్ నిర్వాహణ నిమిత్తం జవహర్‌నగర్, మౌలాలికి చెందిన రియల్ ఎస్టేట్, స్క్రాప్ వ్యాపారి మహ్మద్ వాసి ఉజ్ జమాన్ అలియాస్ ఇర్ఫాన్, మౌలాలికి చెందిన పి.రాజశేఖర్‌రెడ్డి, ఓల్డ్ సఫిల్‌గూడకు చెందిన వ్యాపారి మహ్మద్ నవాజ్, మౌలాలి సాదుల్లానగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ సయ్యద్ మజీద్ హైదర్ ఈ నలుగురి వద్ద రాంరాజ్ రూ.57 లక్షల అప్పు అధిక వడ్డీకి తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు రోజూ వడ్డీ వసూలు చేసేవారు. వడ్డీ కోసం వారి వేధింపులు ఎక్కువయ్యాయి. మితిమీరిన అక్రమ వడ్డీని డిమాండ్ చేశారు.
వడ్డీ చెల్లించని పరిస్థితిలో బలవంతంగా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. ప్రామిసరీ నోట్లు, వీరికి చెందిన భూమి పత్రాలను కూడా తీసుకున్నారు. ఇంటికి వచ్చి అవమానించారు. ఇవన్నీ భరించలేక రాంరాజ్, అతని భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్‌లు ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక సూసైడ్ నోట్ రాశారు. ‘మా చావుకు నలుగురు కారణమని, వారు అనేక బాధలు పెట్టారని.. తీసుకున్న డబ్బు ఇవ్వాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించారని’ అందులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తులో కాల్ డాటా ఆధారంగా రికార్డ్స్ కూడా పరిశీలించి నిర్ధారించుకున్నారు.
నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు అధిక వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చినట్లు, తిరిగి చెల్లింపు కోసం వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు అంగీకరించారు. దీంతో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మరణించిన వ్యక్తి జారీ చేసిన 12 ఖాళీ చెక్కులు, 6 ఖాళీ ప్రామిసరీ నోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లా, గాంధీమాల్ గ్రామంలో ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన భూమి పత్రాలు, మృతుడి కుటుంబ సభ్యులను బెదిరించడానికి నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోస్లు స్వాధీనం చేసుకున్నారు.అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఓయూ ఏసీపీ జి.జగన్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, ఎస్సైలు సురేష్, తరుణ్ పాల్గొన్నారు.