traffic jam : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై-గుజరాత్ హైవేపై 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా వర్షాలు గుజరాత్, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను నీట ముంచాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులోని ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది.
ఇరు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గం, రైలు మార్గం భారీగా దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 48వ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 35-40 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు, మూడు రోజులుగా వాహనాలు రహదారిపైనే ఆగిపోయి ఉన్నాయి. ఈ మార్గంలో మరో ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఇబ్బంది ఎక్కువగా ఉంది. శుక్రవారం కూడా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు రైలు సర్వీసుల్లోనూ భారీ ఆటంకం ఎదురవుతోంది. అనేక ప్రాంతాలకు రైళ్లు నిలిచిపోయాయి. ఢిల్లీ-ముంబై, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు కూడా రైళ్లను అధికారులు నిలిపివేశారు.
వర్షాల కారణంగా పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. మరో 244 మందిని అధికారులు రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తోపాటు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, పోలీసులు, ఇతర విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.