Hyderabad | హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన మహీంద్రా స్కార్పియో (AP09 CE2415) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న 20 ఏళ్ల యువకుడు రూప్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
వేగంగా వచ్చిన స్కార్పియో ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించారు. వాహనాన్ని 20 ఏళ్ల రూప్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను మద్యం మత్తులో వాహనం నడిపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో మరెవరైనా ఉన్నారా? వాహనం ఏ వేగంతో ప్రయాణిస్తోంది? అనే వివరాలపై ఆరా తీస్తున్నారు.
ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.