Maharashtra : మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పికప్ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం, మహారాష్ట్ర, అమరావతి జిల్లా, ధామంగోన్ రైల్వే స్టేషన్ సమీపంలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ఛానల్ 97 సమీపంలో జరిగింది.
కొంతమంది భక్తులు ఒక పికప్ వ్యాన్‌లో నవరాత్రి వేడుకలు జరుపుకొనేందుకు ఒక ఆలయానికి బయల్దేరారు. బుల్దానా జిల్లాలోని షెగావోం నుంచి వార్ధాకు వెళ్తుండగా పికప్ వ్యాన్‌ను ఒక ట్రక్కు ఢీకొంది. ట్రక్కు వేగంగా ఢీకొనడంతో పికప్ వ్యాన్‌లోని ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితుల్ని వాహనం నుంచి బయటకు తీశారు.
క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. దామంగోన్ రూరల్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందుతోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద మృతులకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.