Viswanathan Anand : భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్(Viswanathan Anand)కు అరుదైన గౌరవం లభించింది. చదరంగం ఆటలో సుదీర్ఘ అనుభవమున్న ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య(FIDE) మధ్యంతర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. కొన్ని రోజులు తాత్కాలిక ప్రెసిడెంట్‌గా సేవలందిచనున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కాడీ ద్వొర్కోవిచ్పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో తాత్కాలిక ప్రాతిపదికన భారత లెజెండ్‌కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది ఫిడే. ఈ విషయాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించిందీ సంస్థ.
భారత మొట్టమొదటి గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న అర్కాడీ ద్వొర్కోవిచ్పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో ఆనంద్ కొన్నిరోజులు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందున.. రష్యా ఆటగాళ్లను అర్కాడీ లక్ష్యంగా చేసుకోవడంపై ఆగ్రహించిన యూరోపియన్ యూనియన్ ఆయనపై వేటు వేసింది.

2012 నుంచి 2018 మధ్య కాలంలో రష్యా ఉపప్రధానిగా పనిచేసిన ఆర్కాడీ.. ఆపై ఫిడే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2018 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన.. 2022లో మళ్లీ విజయం సాధించడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించాడు. దాంతో.. భారత దిగ్గజం ఫిడే ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే.. అర్కాడీపై ఆంక్షల నేపథ్యంలో అధ్యక్ష పదవి ఖాళీ అవ్వడంతో.. డిప్యూటీ ఆనంద్‌ను ప్రమోట్ చేసింది ఫిడే. తనను అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆనంద్ ఫిడేకు ధన్యవాదాలు తెలిపాడు.
Following the decision by President Arkady Dvorkovich to suspend the exercise of his duties, and in accordance with the FIDE Charter, I have assumed the responsibilities of Interim President.
I want to thank Arkady for his leadership and for putting the interests and stability… https://t.co/KexdV5WLal
— Viswanathan Anand (@vishy64theking) July 24, 2026
‘ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్ను బాధ్యతల నుంచి సస్పెండ్ చేయడతో.. నన్ను మధ్యంతర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అర్కాడీ నాయకత్వానికి, ఫిడేలో స్థిరత్వానికి అధిక ప్రాధాన్యమిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఫిడే మండలి, ఆడ్మినిస్ట్రేషన్, సమాఖ్య సభ్యులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా చెస్ కుటుంబానికి సేవలు అందించాలనుకుంటున్నా. ఫిడే కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. అర్కాడీ పటిష్టమైన బృందాన్ని నిర్మించారు. ఆయన దూరదృష్టిని.. ఈరోజు మీ అందరి సహకారంతో నేను ముందుకు తీసుకెళ్తాను’ అని ఆనంద్ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించాడు. అయితే.. ఆనంద్ ఎన్ని రోజులు మధ్యంతర అధ్యక్షుడిగా కొనసాగుతాడు అనేది తెలియాల్సి ఉంది.