– సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 13 : రెండున్నర కోట్ల విలువ చేసే 499 కేజీల గంజాయిని సోమవారం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్లో ప్రభుత్వ నిషేదిత గంజాయిని భద్రాచలం నుండి కొత్తగూడెం, ఖమ్మం మీదుగా రాజస్థాన్లోని జైపూర్ కి అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు, సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి తన సిబ్బందితో కలిసి సంయుక్తంగా సుజాతనగర్ మండలం, వేపలగడ్డ గ్రామంలో ఉన్న అన్నపూర్ణ బేకరీ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. KA3BA 6754 అను నంబర్ గల అశోక్ లేలాండ్ లారీ కంటైనర్ కొత్తగూడెం నుండి ఖమ్మం వైపుగా వస్తుండగా, పోలీసులు ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు కేసు విషయాలను వెల్లడించారు.
కంటైనర్ ను తనిఖీ చేయగా అందులో 96 గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగిందన్నారు. ప్యాకెట్లలో సుమారుగా రూ.2,30,00,000/-విలువ గల 499 కేజీల గంజాయి ఉన్నట్లు చెప్పారు. గంజాయిని విక్రయించిన, కొనుగోలు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మహారాష్ట్రకు చెందిన జగదీశ్ దయారాం పాటిల్(37), కంటైనర్ లారీ ఓనర్ కం డ్రైవర్, కర్ణాటకకు చెందిన సంజు కుమార్ (49)లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
గంజాయిని, నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన సీఈఎస్ సీఐ రమాకాంత్, ఎస్ఐలు ప్రవీణ్, రామారావు, వారి సిబ్బందిని, సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి, వారి సిబ్బందిని, కేసు విచారణాధికారి, సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.25 కోట్ల విలువ చేసే 5,200 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు, 59 కేసులు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.
Kothagudem Town : రెండున్నర కోట్ల విలువైన గంజాయి పట్టివేత