– ఒకే ఒక్కరి చేతిలో ప్రధానోపాధ్యాయుల భవితవ్యం
– కార్యాలయంలో ఉండాల్సిన కీలక రికార్డులు ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో
– తోటి ప్రధానోపాధ్యాయుల జీవితాలతో హెచ్ఎం చెలగాటం
– చూసీ చూడనట్లుగా ఉన్నతాధికారుల వ్యవహారం
– నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్
– వేల రూపాయలు చేతులు మారినట్లు తీవ్ర ఆరోపణలు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) కార్యాలయం భారీ కుంభకోణానికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన అత్యంత కీలకమైన సేవా పుస్తకాలు (సర్వీస్ రిజిస్టర్లు) కార్యాలయం నుంచి మాయమై, ఓ ప్రధానోపాధ్యాయుడి ఇంట్లో ఉన్నాయన్న వార్త ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, కొందరి అండదండలతో ఒకే వ్యక్తి తోటి ఉద్యోగుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నాడని, వారిని మానసికంగా వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సేవా పుస్తకాలు నిబంధనల ప్రకారం ఐటీడీఏ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలో అత్యంత భద్రంగా ఉండాలి. ఉద్యోగి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సెలవులు, వైద్య ఖర్చులు వంటి ప్రతి అంశం ఇందులో నమోదవుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇది ప్రాణాధారమైన రికార్డు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ సేవా పుస్తకాలన్నీ దమ్మపేట మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నియంత్రణలో ఉన్నాయని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన సదరు హెచ్ఎం, ఐటీడీఏ అధికారులకు అనధికారిక సేవలు చేస్తూ, వారి అండతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఈ ప్రధానోపాధ్యాయుడు తన పై అధికారులకు సకల మర్యాదలు చేస్తూ, వారి వ్యక్తిగత పనులను చక్కబెడుతూ వారిని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని ఆరోపణలున్నాయి. దీనిని అదునుగా చేసుకుని తోటి ప్రధానోపాధ్యాయుల సేవా పుస్తకాలను తన వద్దే ఉంచుకుని, తనకు అనుకూలంగా లేనివారికి ఇంక్రిమెంట్లు, సెలవుల నమోదులో జాప్యం చేస్తూ వేధిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. తనకు నచ్చిన వారికి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూరుస్తూ, సేవా పుస్తకాలను ట్యాంపరింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.
ఈ వ్యవహారంలో మరో చీకటి కోణం కూడా వెలుగులోకి వచ్చింది. నకిలీ పండిట్ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మహిళా ప్రధానోపాధ్యాయుల సేవా పుస్తకాల జిరాక్స్ కాపీలను, సదరు హెచ్ఎం బయటి వ్యక్తులకు అమ్మి వేల రూపాయలు సంపాదించాడని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారంతో వారిని బ్లాక్మెయిల్ చేసి, లబ్ధి పొందుతున్నాడని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఐటీడీఏ విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ మహిళా అధికారికి ఇతను మధ్యవర్తిగా వ్యవహరించాడన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఐటీడీఏ కార్యాలయంలో ఇంత పెద్ద తతంగం జరుగుతున్నా, ప్రాజెక్టు అధికారి (పీవో) దృష్టికి రాకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందా? లేక వారు ఉద్దేశ పూర్వకంగానే కళ్లు మూసుకున్నారా? అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అక్రమాలపై ఇప్పటికే హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యమని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై వైఎఫ్ఎఆర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐటీడీఏ పీవో ఈ విషయంపై స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయంలో అత్యంత రహస్యంగా ఉండాల్సిన సేవా పుస్తకాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయో తేల్చి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఏటీడబ్ల్యూఓ అశోక్‌ను వివరణ కోరగా ఫిర్యాదులు వచ్చాయి కానీ నేరుగా ఎవరూ ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఫిర్యాదు అందితే విచారణ చేస్తామన్నారు.