Indian Cricketer | భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్యాంప్‌ను విడిచి స్వగ్రామానికి వెళ్లాడు. అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ సమాచారం ప్రకారం, రింకూ సింగ్ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారని తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో కుటుంబంతో ఉండేందుకు రింకూ జట్టును తాత్కాలికంగా వీడినట్లు సమాచారం.రింకూ మళ్లీ జట్టులో చేరుతాడా? లేదా టోర్నమెంట్‌కు పూర్తిగా దూరమవుతాడా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. టీమ్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో రింకూ సింగ్ కీలక ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం అతడికి ఉంది. అతని గైర్హాజరు జట్టు కాంబినేషన్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఈ వరల్డ్ కప్‌లో మాత్రం అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎక్కువగా చివరి ఓవర్లలో క్రీజ్‌లోకి రావాల్సి వచ్చింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అత్యధిక స్కోరు 11*. ఈ ఏడాది 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 115 పరుగులు చేసి, సగటు 28.75, స్ట్రైక్‌రేట్ 132.18 నమోదు చేశాడు. బెస్ట్ స్కోర్ 44*.
చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలైన తర్వాత జట్టు సమీకరణాలు కఠినంగా మారాయి.ఈ నేపథ్యంలో రింకూ సింగ్ గైర్హాజరు జట్టుపై మానసికంగా కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే క్రికెట్ కంటే కుటుంబ పరిస్థితికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో రింకూ సింగ్ కుటుంబానికి క్రికెట్ ప్రపంచం మద్దతుగా నిలుస్తోంది. అభిమానులు కూడా అతని తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారు.