e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News NRI Updates : ఇవాల్టి ముఖ్యాంశాలు

NRI Updates : ఇవాల్టి ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల శుభాకాంక్ష‌లు

ఆదివారం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.

ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తాం : కేటీఆర్

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నారాయ‌ణ‌పేట జిల్లా కేంద్రంలో శ‌నివారం ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉండ‌గా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని తేల్చిచెప్పారు. కృష్ణా జ‌లాల‌పై రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని.. చ‌ట్ట‌ప్ర‌కారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామ‌ని పున‌రుద్ఘాటించారు.

ఆంధ్రా తొత్తుల‌కు తెలంగాణ‌లో స్థానం లేదు : హ‌రీశ్‌ రావు

- Advertisement -

ఆంధ్రా తొత్తుల‌కు, అవ‌కాశ‌వాదుల‌కు తెలంగాణ‌లో స్థానం లేద‌ని మంత్రి హ‌రీశ్‌ రావు స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ‌ను అవ‌మానించిన నాయ‌కుడు వైఎస్ఆర్ అని.. ఆయ‌న‌ వార‌సుల‌మ‌ని కొంద‌రు వ‌స్తున్నారు. అలాంటి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మంత్రి సూచించారు. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట‌లోని పలువురు కాంగ్రెస్‌ నాయ‌కులు హరీశ్ రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్ల‌లో చేయ‌లేని ప‌నుల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏడేండ్ల‌లో చేసి చూపించింద‌న్నారు.

సినీ న‌టుడు క‌త్తి మ‌హేశ్ మృతి

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేశ్ మృతి చెందాడు. జూలై 26న తెల్ల‌వారుజామున క‌త్తిమ‌హేశ్ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. త‌న సొంతూరు పీలేరు నుంచి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో ఆగివున్న లారీని ఆయ‌న కారు బ‌లంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆయ‌న్ను.. మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డే చికిత్స పొందుతున్న క‌త్తి మ‌హేశ్ శ‌నివారం తుదిశ్వాస విడిచారు.

కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన

కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కోగలమని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితల కథలను వంశీ ఆర్ట్స్ థియేటర్ రూపొందించిన ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన పంచసూత్రాలను ఉప రాష్ట్రపతి ప్రతిపాదించారు.

టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ఆధ్వ‌ర్యంలో ఉచిత‌ ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్స్ సేవ‌లు

సౌతాఫ్రికాలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కొవిడ్ రోగుల స‌హాయానికి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ముందుకొచ్చింది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా అదేవిధంగా కేటీఆర్ జ‌న్మ‌దినం(జులై 24) ను పుర‌స్క‌రించుకుని ఉచిత ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. సౌతాఫ్రికాలోని తెలుగు క‌మ్యూనిటీకి రెండు ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్స్, ఆక్సిజ‌న్ ఆక్సిమీట‌ర్ సేవ‌ల‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగ‌రాజు తెలిపారు.

రేపటి నుంచి నెహ్రు జూపార్క్‌ ఓపెన్‌

హైదరాబాద్‌లోని నెహ్రు జూలాజికల్‌ పార్కులోకి ఆదివారం నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్‌ పునః ప్రారంభం కానుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా పార్కులు, జూ పార్కులు మూసే ఉన్నాయి. ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో వాటిని తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాబోయే 3 రోజుల్లో తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. ఇవాళ ఒక‌ట్రెండు ప్ర‌దేశాల్లో భారీ వ‌ర్షాలు, రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. రాగ‌ల ఐదు రోజుల్లో తెలంగాణ‌లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

తెలుగు అకాడమి పేరుమార్చిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు అకాడమి పేరును ప్రభుత్వం మార్పు చేసింది. అకాడమికి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు-సంస్కృత అకాడమిగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమి ఉంటుందని ప్ర‌శ్నించారు.

శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలను ఈ నెల 12 నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ప్రత్యక్ష సేవలు ప్రారంభమైనా.. పరోక్ష సేవలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.

17 నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్య‌ప్ప స్వామి ఆలయాన్ని మాస పూజల కోసం ఈ నెల 17న తెరువనున్నారు. ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను భక్తులు సమర్పించాల్సి ఉంటుంది.

మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన‌ కోవాగ్జిన్ టీకాకు త్వ‌ర‌లో డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి ద‌క్క‌నున్న‌ది. కోవాగ్జిన్‌కు సంబంధించిన డేటాను స‌మీక్షిస్తున్నామ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌

తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

త్వరలో భారత్‌ నుంచి దుబాయికి విమానాలు

భారత్‌ నుంచి దుబాయి, అబుదాబికి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి దుబాయికి విమానాలు నడుస్తాయని గల్ఫ్‌ న్యూస్‌ తెలిపింది. అబుదాబికి ఈ నెల 21న సర్వీసులు పునరుద్ధరించనున్నారు. అయితే, యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) మాత్రం భారత్‌కు తిరిగి ఇన్‌బౌండ్ విమాన సర్వీసులను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement