హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రైళ్ల ద్వారా రాష్ర్టానికి వచ్చిన యూరియాను దించేందుకు ప్లాట్‌ఫామ్‌లు దొరకడం లేదని, అందుకే రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యమవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు తెలిసింది. రైల్వే శాఖ బియ్యం వ్యాగన్లకు ఇస్తున్న ప్రాధాన్యం యూరియాకు ఇవ్వడం లేదని కేంద్రంపైనే నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌లో రైల్వే అధికారులు బియ్యంతోపాటు ఇతర వస్తువుల వ్యాగన్లకు ప్లాట్‌ఫామ్‌లు కేటాయించారని చెప్తున్నారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని గమనంలో ఉంచుకొని యూరియా అన్లోడింగ్ విషయంలో రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు నిష్క్రియాపరులుగా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి సీఎం కేసీఆర్ యూరియాను సకాలంలో రైతులకు అందించేందుకు ఏకంగా ఒక ఐఏఎస్ అధికారినే కేటాయించారని, ప్రస్తుత ప్రభుత్వం రాష్ర్టానికి చేరిన యూరియాను రైల్వే గోడౌన్ నుంచి తెచ్చుకోవడంలో విఫలమవుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.