హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘బ్యూరోక్రాట్’ దోపిడీ అంతులేకుండా పెరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయంలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ ఐఏఎస్‌లు బయట సొంతంగా దుకాణాలు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా 11 మంది అగ్రశ్రేణి బ్యూరోక్రాట్ల మీద తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లు కోట్లకు పడగలెత్తారని, వికారాబాద్ జిల్లాలోని మొయినాబాద్, దాని సమీప మండలాల్లో వ్యవసాయ ఫాం హౌజ్‌ల మీద పెట్టుబడులు పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం మంది ముఖ్య నేతల చుట్టూ, కీలక శాఖల్లో ఉన్న అధికారులే కావడం గమనార్హం. వివిధ పనుల మీద సీఎంవోకు, సచివాలయానికి వచ్చే ఎగు వ, మధ్యశ్రేణి వ్యాపార వర్గాలతో సీనియర్ అధికారులు పరిచయాలు పెంచుకొంటున్నారని చెప్తున్నారు. నడిరోడ్లు మొదలు స్టార్ హో టళ్ల వరకు అడ్డాలుగా మార్చుకొని డీల్ మాట్లాడుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుమాస్తాలుగా.. హెడ్ క్లర్క్‌లుగా..
ముఖ్యనేత సోదరుల భూ దందాలో దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్ అధికారి గుమస్తా తరహా సాయం అందిస్తుండగా, తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో మహిళా సీనియర్ అధికారి భవన నిర్మాణ అనుమతులు, అక్రమ భవన నిర్మాణాలు, కమర్షియల్ లావాదేవీల మీద ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లకు హెడ్‌క్లర్క్‌గా పని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెల్లుతున్నాయి. ఆంధ్ర పాంతానికి చెందిన మరో సీనియర్ అధికారి నంబర్ 2 నేత ఇంటికి పెద్ద గుమస్తాగా పని చేస్తున్నారని, ఆయన కుమారుడు, కూతురు నడిపే రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా ఆయన పర్యవేక్షణలోనే సాగుతున్నాయనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. వీళ్లంతా తమ వాటా తాము తీసుకున్న తర్వాతే మిగిలినవాటిని పంపాల్సిన వాళ్లకు పంపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారులు తమ సలహాలు, సూచనలతో ఇప్పటికే ముఖ్యనేతను, నంబర్ 2 నేతను పీకల్లోతు అవినీతి ఊబిలోకి నెట్టేశారనే ప్రచారం జరుగుతున్నది.
రోడ్డు మీదనే మూటలు..
ఇటీవల కార్మిక శాఖలో జరిగిన బీమా స్కాం స్టార్ హోటల్లోనే జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. అనామక కంపెనీలకు కార్మికుల సొమ్ము రూ.349 కోట్లు కట్టబెట్టిన కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రూ.18 కోట్లు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తర్వాత ఉన్న అధికారికి రూ.1.5 కోట్లు ముట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద డబ్బు సంచులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదే శాఖకు చెందిన ఓ ఉద్యోగి ఈ తతంగాన్ని వీడియో తీసినట్టు కార్మిక భవన్ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. వీడియోలు తీసినట్టు చెప్తున్న ఉద్యోగి మూడు నెలలుగా విధులు హాజరు కావటం లేదని సమాచారం.
4 శాతం కమీషన్ ఆరోపణలు
నాలుగు నెలల కిందట ఒక కీలక శాఖలో రూ.3 వేల కోట్ల సామాగ్రి కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు, పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన మిషనరీ, స్తంభాలు, వైర్లు కొలుగోలు చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ కొనుగోళ్లలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు 4 శాతం కమీషన్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ శాఖ మీద వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయని చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఒక భారీ తిమింగలాన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహా దాడి ఉన్నతాధికారుల మీద కూడా జరిగితే రాష్ట్ర ప్రజలకు ఏసీబీ మీద మరింత నమ్మకం కుదిరేదని ఆ శాఖ ఉద్యోగులు చెప్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారి పార్ట్ టైం కింద ముఖ్యనేత సోదరుల భూం కుంభకోణాల్లో సహకారం అందిస్తున్నారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన ప్రపంచ స్థాయి ఈవెంట్లో ప్రభుత్వ తరఫు యాడ్స్ నిధులు అన్ని ఒకే అధికారి చేతుల్లోకి వెళ్లాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఒక శాఖకు కీలక బాధ్యతలు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ ఏకంగా నల్లధనం చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కలెక్టర్లదీ అదే తీరు..
పలువురు కలెక్టర్లు జిల్లాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సన్నిహితంగా మెదులుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో చక్రం తిప్పగలిగే స్థాయిలో ఉన్న కొందరు కలెక్టర్లు ఏకంగా పలు వ్యాపారల్లో పెట్టుబడులు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
రాజకీయ నేతల తరహాలో తమ ఫ్యామిలీ మెంబర్ల ద్వారా సెటిల్మెంట్లు చేయిస్తున్నట్టు, బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ల అక్రమ వ్యవహారం సీఎంవో దృష్టికి రావటంతో కాన్ఫరెన్స్ నిర్వహించి అవినీతి విషయంలో సీఎం సీరియస్‌గా హెచ్చరించినట్టు తెలిసింది. అయినా పెద్దగా మార్పు లేదని సమాచారం.
సీఎస్ రహస్య నివేదిక
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్లపై ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కొత్తగా జిల్లాలకు వెళ్లిన అధికారులు, అంతకు ముందు నుంచే పని చేస్తున్న ఐఏఎస్ కదలికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. ఎవరెవరు ఎలాంటి దందాలకు పాల్పడుతున్నారు? అనే సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఐఏఎస్‌ల వ్యవహారాలు, కదలికలు, శాఖల మీద దృష్టి పెట్టిన తీరు, బయటి దందాలు తదితర అంశాల మీద సీఎస్ రామకృష్ణారావు రహస్య సమాచారం సేకరించి సీఎంకు నివేదించినట్టు సమాచారం. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో పాటు తనకున్న సొంత నెట్వర్క్ ద్వారా ఈ నివేదికలు రూపొందించినట్టు తెలిసింది. రామకృష్ణారావు సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏకకాలంలో దాదాపు 36 మంది ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఆ టైంలోనే అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు కార్యదర్శులను, కలెక్టర్లను బదిలీ చేశారు. అయినా ఎటువంటి మార్పు లేకపోవటంతో మరోసారి బదిలీ చేయాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సూచించినట్టు తెలిసింది. అయితే సీఎస్ ఇచ్చిన నివేదికలో ఎక్కువ మంది ముఖ్యనేతల చుట్టూ ఉండే సీనియర్ అధికారులు ఉన్నారని, వారి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సచివాలయ వర్గాల్లో నెలకొన్నది.