హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘మన సార్‌కు నేనేంత చెప్తే అంత. కావాలంటే చూడండి.. నేను ఇవాళ సార్ వాళ్ల ఇంట్లోనే ఉన్నా. ఇదే నేనున్న లోకేషన్.. చూడండి. సార్‌తో ఇప్పుడే కేరళకు వెళ్లొచ్చాను. ఇవిగో ఫొటోలు చూడండి. ఫలానా ఐఏఎస్‌కు పోస్టింగ్ నేనే ఇప్పించా. ఫలానా సీఎండీని నేనే నియమించా’ ఇవీ విద్యుత్తుశాఖలో రాచకార్యాలు చక్కబెడుతున్నట్టుగా ఓ బ్రోకర్ చెప్తున్న మాటలు. ఇవన్నీ వట్టి మాటలా.. గట్టి మాటలా.. ఎవరి తరపున మాటలు అనే విషయంపై సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. సదరు ప్రైవేట్ వ్యక్తి వ్యవహారం వివాదాస్పదంగా నిలుస్తున్నది. చూస్తూ ఊరుకుంటే పెద్దల అండతో అతడు రెచ్చిపోతున్నాడని, ఐఏఎస్ అధికారులకు ఫోన్ చేసి మరీ ‘ఫలానా వివరాలు పంపించండి.. సార్ అర్జెంట్‌గా పంపమన్నారు’ అని అంటున్నాడట. అసలేంటీ ఇతడి ఓవరాక్షన్ అంటూ కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటూ… తలలు పట్టుకుంటూ… అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఎవరీ పవర్ఫుల్ బ్రోకర్?
విద్యుత్తుశాఖలో తాను ఎంత చెప్తే అంత అనీ.. ఆర్థికశాఖ నుంచి బిల్లులు మంజూరు చేయిస్తాననీ.. సచివాలయంలో మెరుపువేగంతో, ఒక్క ఫోన్‌కాల్‌తో పనులు చక్కబెడుతున్న ఈ మెరుపుతీగ పవర్ చూసి.. ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారని తెలుస్తున్నది. ఇంతకీ అతడు ఎవరా.. అని బ్యాక్‌గ్రౌండ్ ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయట. సదరు బ్రోకర్ స్వస్థలం ఏపీలోని కడప జిల్లా అనీ.. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్న నాయకుడికి ఏండ్ల నుంచి సన్నిహితుడనీ.. కొందరు చెప్తున్నారు. గతంలో సదరు నాయకుడి వ్యక్తిగత వ్యవహారాలు చూసేవాడట. ఇప్పుడు నాయకుడు మంచి స్థానంలో ఉండటంతో.. అతడి అండదండలతో తన ‘పవర్’ చూపిస్తున్నాడని సచివాలయవర్గాలు చెప్తున్నాయి. గట్టి నేతతో దిగిన ఫొటోలు చూపిస్తూ కొందరిని బెదిరిస్తున్నాడట. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ‘యవ్వారాలు’ అన్నీ అతడితోనే మాట్లాతున్నారంట. కాంట్రాక్టులు ఇప్పించడం, బిల్లులు మంజూరు చేయించడమూ… గట్రా… అన్నీ పవర్ఫుల్ బ్రోకరే చూస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.
ఇచ్చట బిల్లులు మంజూరు చేయించబడును!
సచివాలయంలో సదరు బ్రోకర్ ఓ నాయకుడి తరపున అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా.. కాంట్రాక్టర్లతో పర్సంటేజీలు మాట్లాడుకుని సెటిల్మెంట్లు చేస్తున్నాడట. కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి.. ‘ఏదైనా బిల్లు పాస్ కావాలంటే నా దగ్గరకు రండి’ అంటున్నాడట. ఎవరైనా కాంట్రాక్టర్లు వస్తే.. రెండు, మూడు సార్లు తిప్పించుకున్న తర్వాత ‘పైనోళ్లకు 15శాతం.. నా వాటా వేరే’ అంటూ అంటూ బేరం పెడుతున్నాడట. ‘మీతోపాటు ఇంకా ఎవరైనా నమ్మదగిన కాంట్రాక్టర్లు ఎవరైనా తీసుకురండి. బిల్లులు పాస్ చేయించేద్దాం.. నాదీ బాధ్యత. అలాగే ఇంజినీర్ల పోస్టింగ్స్ కూడా ఉంటే చెప్పండి. పోస్టులను బట్టి లెక్క చూసుకుందాం’ అంటూ దందాకు తెరలేపాడట. కొందరు పెద్దల అండదండలతోనే ఆ వ్యక్తి రెచ్చిపోతున్నాడని తెలుస్తున్నది. అతడి ఆగడాల నుంచి విముక్తి కల్పించాలని ఇంధనశాఖ, విద్యుత్తు సంస్థల ఉద్యోగులు కోరుతున్నారు.
అతడి పేరెత్తితేనే చిరాకు
సదరు నాయకుడు ఇచ్చిన చనువుతో ప్రైవేట్ వ్యక్తి తమ నెత్తిన కూర్చుకుంటున్నాడని కొందరు అధికారులు వాపోతున్నారని తెలుస్తున్నది. ఐఏఎస్ అధికారులకు ధమ్కీలు ఇవ్వడం, కాంట్రాక్టర్లతో సెటిల్మెంట్లు చేయడంలో బ్రోకర్ ఓవర్ చేయడం వివాదాస్పదంగా మారుతున్నదని సమాచారం. బ్రోకర్ పేరును ఎవరైనా ప్రస్తావిస్తే కూడా కొందరు అధికారులు చిరాకు పడుతున్నారట. ఇటీవల బ్రోకర్… ఏదో పైరవీ లేఖ పట్టుకుని ఒక ఐఏఎస్ అధికారి వద్దకు వెళ్లగా.. ‘నువ్వు ఇంకోసారి నా దగ్గరకు రావొద్దు.. వెళ్లిపో’ అంటూ ఆ అధికారి చీవాట్లు పెట్టారట. మరో ఐఏఎస్ అధికారి… ఆ బ్రోకర్‌కు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదట. సచివాలయంలో పవర్ఫుల్ బ్రోకర్ దందాలపై కొందరు అధికారులు ఓ పెద్ద ఐఏఎస్‌కు కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తున్నది.