ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్. నీ తోటోళ్లు ఎంత మంచిగ చెహ్రాలు పెంచి నమాజ్, రోజా అని దీన్ల ఉంటరు. నువ్వేమో అట్ల ఉండవ్. ఎప్పుడు పప్పా.. దీన్ రాస్తాలకు వస్తవ్? ఇట్లనే ఉంటే దోజక్లకు పోతవ్” అసహనం వ్యక్తంచేశాడు రెహమాన్ పెద్దకొడుకు అద్నాన్.
మూరెడు పెరిగిన తన తెల్లని తల వెంట్రుకలను జుట్టు వేసి రబ్బర్ బాండ్ పెట్టుకుంటాడు రెహమాన్. ఎన్నో సవరాలను మోసిన ఆ జుట్టు పోతే తన ఆత్మాభిమానం దెబ్బతిని ఆకాశం నుండి పాతాళానికి కుదేసినంత పనౌతుంది. అద్నాన్ జానెడు గెడ్డంతో లాల్చీ పైజామాలో ఉన్నాడు. మసీదులో మౌల్వీగా పనిచేస్తున్నాడు. గెటప్‌ని బట్టి పైవాడు స్వర్గ-నరకాలను డిసైడ్ చేస్తడా? అదే గెటప్‌ను ఓ ఉగ్రవాదిలా చిత్రించినోళ్లకు, అదే గెటప్ వాడుకొని నీచపు పనులు చేస్తున్నోళ్లను నరకానికి పంపిస్తడా మరి? అనే ప్రశ్నలు రెహమాన్‌లో..
నిండా కొంగు కప్పుకొన్న ఆయన భార్య మున్నీబీ, కొడుకు వైపునుంచి వకాల్తా పుచ్చుకుంటూ.. “ఆయనకు చెప్తే దమాక్కు ఎక్కుతలేదురా. అవుశంత ఎన్ని తైతక్కలాడినా నడిశింది గనీ.. కొనజాలకన్న జర దీన్ల ఉండాలె గదా? చెహ్రా ముసల్మాన్ల ఫర్జ్ అన్నా ఇనడు” అంటూ విసుక్కుంది. అలా అంటున్న భార్య ముఖంలోకి విచిత్రంగా చూశాడు! జీవితంలో ఎన్ని వెధవ పనులు చేసినా.. చివరికి జానెడు గెడ్డం పెంచుకుని దీన్ దారిలో నడిస్తే అతని పాపాలన్నీ కడిగిపోతాయా!? అనే లాజిక్‌లెస్ ప్రశ్న అతని అంతరంలో కణకణ మోగే గంటలా మార్మోగింది. ఈ సూటిపోటి మాటలు చాలా ఏళ్లుగా వాళ్లంటున్నవే, తను వింటున్నవే. మందిర్-మసీదు గొడవల్లో ఎంతోమంది అమాయకులు మానప్రాణాలు కోల్పోయారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఇద్దరూ నమ్ముకున్న ఆ పైవాళ్లు ఏం చేస్తున్నట్టు? తమాషా చూశారా? అలా అయితే వాళ్లు దేవుళ్లేనా? అనుకున్నాడు. వాళ్లువాళ్లు నమ్ముకున్న నమ్మకాల మానభంగం జరిగినట్టేగా?
ఒక నేత.. ఐదు నిమిషాలు టైమిస్తే ఒక మతంవాళ్లను లేపేస్తానని యథేచ్ఛగా అంటాడు. మరో లీడర్.. దేవుని శోభాయాత్రలో ఆడబిడ్డలను బలాత్కారం చెయ్యండని వాగుతుంటే ఆయన వింటూ ఊకొడుతున్నాడా? వాళ్ల చెంపలు వాయించి ‘భారతీయులంతా భాయ్ భాయ్రా వెధవలూ’ అంటూ ఎందుకు బుద్ధి చెప్పలేకపోయాడు? సాంప్రదాయబద్ధంగా ఉండడని వాళ్లకు కోపం. తనకు నచ్చినట్టు సాధారణ మనిషిలా బతకడమే అతనికి ఇష్టం. బుద్ధిజీవిగా మానవ సంబంధాలు, సైన్సును కాదని ఏ అతీంద్రియ శక్తులూ లేవనుకున్నాడు. అప్పటినుంచే మతాన్ని లైట్ తీసుకున్నాడు రెహమాన్.
“ఇగో పప్పా! ఇదే నీకు ఆఖరి వార్నింగ్. నువ్వు చెహ్రా పెంచితేనే ఈ ఇంట్ల ఉంటం. లేకపోతే బైటకు ఎల్లిపోతం” అన్నాడు అద్నాన్. తన ముఖం మీద చెహ్రా ఉందన్న గర్వం అతని నరనరాన ఉట్టిపడుతోంది.“అవున్రా.. మనమే ఎల్లిపోదాం. ఆయనొక్కడే ఈ ఇంట్ల నిమ్మలంగ ఉండని” రుద్ధంగా అందామె.“జవానీ అంతా గా ఫాల్తు డాన్సులు జేసినవ్. ముసల్తనానికైనా జర హోష్లకు రావాలె గదా?” అంటున్న కొడుకు చెంప ఛెళ్లుమనిపించాడు రెహమాన్.ఆ చర్యకు.. తిరిగి కొట్టడానికి తనకేం అభ్యంతరం లేదన్నంతంగా తండ్రి ముఖంలోకి కొరకొరా చూశాడు అద్నాన్. పద్ధతులు పాటించని మనిషి మనిషే కాదు అతని దృష్టిలో. తండ్రి కూడా ఆ పద్ధతుల ముందు దిగదుడుపే. మధ్యలో మున్నీబీ కల్పించుకుంటూ.. “పోరన్ని కొట్టినవా నీ పాపం చేతులతోని? వాడు నీలెక్క గాదు. చెక్క మొకం వెట్టుకొని లేడు. వాని మొకం మీద హుజూర్ గడ్డం ఉంది. మీ అన్నదమ్ములు, మా అన్నదమ్ములంతా చెహ్రాలు వెంచిర్రు. నీకు వెంచితే రోగమేంది?” భర్తను గుడ్లురిమి చూస్తూ అంది.
“నాతోని ఇన్నేండ్లు సంసారం జేసినదానవే నాది చెక్కమొకం అంటే.. ఇగ లోకం ఏమనాలె? వాళ్లంతా గడ్డాలు వెంచిర్రని నేను పెంచాల్నా? మరి నేను కూచిపూడి డాన్సర్‌ను గదా.. నాలెక్క ఎవరన్న ఉన్నరా? నాయి పాపం చేతులా? ఈ పాపం చేతులతోనే వాణ్ని పెద్ద జేసిన. నాయి అడ్డమైన డాన్సులా? కూచిపూడి కళాకారునిగా ఎన్నో అవార్డులు, రివార్డులతోని ఈ దేశానికి మంచి పేరు, పరపతి సంపాదించుకున్న. ఎక్కడా చిన్న మచ్చలేదు. చేతనైనంతల కులమతాలకు అతీతంగా పేదలకు సాయం జేసిన. నీ కొడుకు, నువ్వు ఒక్కటన్న మంచి పని జేసిర్రా?” అంటున్న భర్తను మిర్రున చూస్తూ.. “వాడు, నేను దీన్ల ఉన్నం. జికర్, నమాజ్ చేసుకుంట ఉన్నం. అది సాలదా?”.. గొంతు పెంచి అంది. “ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులే మిన్న అని మీకు తెల్వనట్టుంది!” దీర్ఘం తీస్తూ అన్నాడు. “గా చేతులెత్తే దువా జేసినం” అంటున్న భార్యను వితండవాదిని చూసినట్టు చూశాడు.
“ఇంటి ముంగలికి అడ్కతినేటోడు వస్తే వాడు ఏంటోడు అని మొకాలు సూశి బిచ్చం ఏసే తాశిల్ చేతులు, బూజువట్టిన దిమాకులు మీయి. నాకు ఎదుటి మనిషిల మనిషి తప్పితే ఏది కనిపియ్యది.” గాద్గదికంగా అన్నాడు. “నీ పిచ్చి డాన్సులతోని సంపాదించిందంతా హరామ్. దాన్ని మేమిప్పుడు శుద్ధి జేస్తున్నం”.. కొడుకు నోటినుంచి ఆ మాట వినగానే రెహమాన్ గుండె బరువెక్కింది. తనను ఎవరు ఏమన్నా అంత బాధ కలగదు కానీ.. తన కళను అంటే మాత్రం రెహమాన్‌కు ఎక్కడలేని బాధ, ఆవేశం కలుగుతుంది. “ఏందీ! నాది హరామ్ సంపాదననా? నృత్యం జేస్తే అది హరామ్ ఎట్ల అయితది? నా కళ నాకు గొప్ప. అట్ల అనుకుంట కూసుంటే జేసే ప్రతీ పని హరామేరా? దూపైతే పుణ్యానికి తాపే నీళ్లను మీ మామ గల్లీ గల్లీకో వాటర్ ప్లాంటు వెట్టి హరామ్ సంపాదన సంపాదిస్తలేడా? ఓహో చెహ్రా వెట్టుకొని చేస్తే హరామ్ గూడా హలాల్ అయిపోతన్నమాట? కుండీల్ల మెంతెంకూర, కొత్తిమీర వెట్టుకున్నా ఇంట్ల బర్కతి ఉండదని, గది మన ఆచారం గాదని గా మొక్కలను పీకిపిచ్చినంత విజ్జిగ నా మొకం మీద మీరు గడ్డం మొలిపియ్యలేరు. ఒకరి బలిమి మీద నేను పెంచ. మీద మెరుగు-లోపట పురుగు లెక్క ఉండ. మనిషి లెక్కలనే ఉంట” నికార్సుగా అన్నాడు. తండ్రిని చిరాగ్గా చూశాడు అద్నాన్.
“మన ప్రవక్త పాటిచ్చిన అవిట్లల్ల మనం ఒక్కటి పాటిచ్చినా జన్నత్లకు పోతం పప్పా”“అవునా కొడుకా.. మరి తాలిబన్లు ఏ రూపంతోని ఉండి గసుంటి అడ్వ పనులు జేస్తున్నరు? ఏ.. ఇట్లుండి మంచి పనులు చేస్తే కుబూల్ కావా?” తండ్రి ప్రశ్నకు నీళ్లు నమిలాడు అద్నాన్. “అట్లయితే ఆది మానవుని లెక్క ఉండచ్చు గదా పప్పా? పెయి మీద గీ బట్టలు ఎందుకు?” అన్నాడు. “నాగరికతకు, సాంప్రదాయానికి ముడివెట్టకు. నాగరికత నేర్సుకున్న మనిషి ఎక్కడా చెడిపోలేదని చరిత్ర చెప్తున్నది. సాంప్రదాయాలను ఆచరించుకుంట ఇప్పటికి ఎందరో ఎన్నో తీర్ల నలిగిపోయిర్రు, బలైపోయిర్రు. తేలుకు తోకల కొండి ఎట్లనో.. మతానికి సాంప్రదాయం అసుంటిది” అన్నాడు రెహమాన్. “ఆయనకు చెప్పుడు బేకార్ ముచ్చటరా! అభ్యుదయం బాగా నెత్తికెక్కింది” రుసరుసలాడింది మున్నీబీ. “అభ్యుదయం నెత్తికెక్కితేనే మనిషి మనిషి లెక్క బతుకుతడు. మతం నెత్తికెక్కితే పశువోలె తయారైతడు”ఆ మాటతో అద్నాన్ తండ్రిని హీనంగా చూస్తూ.. “ఇగో! గీ సొంటెకాయ మాటలన్నీ చిన్నప్పటినుంచి ఇనీ ఇనీ మా చెవులు గడేలు వడ్డయ్. సాలు ఇగ చెప్పకు. అభ్యుదయం బిచ్చపోనికి బువ్వ వెడ్తదేమో గనీ.. దీన్ నీకు స్వర్గాన్నిస్తది. నీకు వారం రోజులు టైమిస్తున్నా పప్పా. చెహ్రా పెంచితేనే మంచిది. లేకపోతే..” అంటూ విసవిసా వెళ్లిపోతున్న కొడుకును చూస్తూ నిట్టూర్చాడు రెహమాన్. మున్నీబీ వెంటనే అందుకుంటూ..
“దునియా దారిల ఉన్న నువ్వు దీన్దార్ అయిన కొడుకు మనసును నొప్పిచ్చినవ్. అల్లా నిన్ను ఎప్పటికీ మాఫ్ జెయ్యడు. ఇంకా మీదికెల్లి నువ్వు సచ్చినంక నీ పీన్గును గా మెడికల్ కాలేజీకి రాసిస్తవా? అదెంత హరామ్ ముచ్చటనో నీకు ఎర్కనేనా? సచ్చినంక మన దేహం మట్టిల కల్వాలె. మొన్న అప్పులతోని ఉరి వెట్టుకొని సచ్చిన ఉస్మాన్‌ను గూడా పోస్టుమార్టం జేసి బొందవెట్టిర్రు. దీన్ల ఎవరన్న పోస్టుమార్టం చేస్తరా?” అంటున్న భార్య మాటలు.. అతనికి దిగజారుడు మాటల్లా అనిపిస్తున్నాయి.
“గన్ల ఏం హరామ్ ఉంది మున్నీ? సచ్చినంక గూడా ఈ చెత్త నలుగురు డాక్టర్ల ప్రాక్టీస్‌కు పనికస్తుందంటే ఎంతమంచి పని అది. పోస్టుమార్టం జేసినంక ఉస్మాన్ అవయవాలతోని నలుగురి జీవితాలు లిలవడ్డయ్ గదా?” భర్త ప్రశ్నకు నీళ్లు నమిలింది మున్నీబీ.వెంటనే ఏదో తోచినదానిలా రాగం తీస్తూ.. “ఇగో! నామాట గూడ ఇనూ పెద్దమన్షీ.. వాడు అన్నట్టు నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో. లేదంటే నేను నా పిల్లల దిక్కే. నువ్వు ఎటన్న వో” అంటూ.. ఆమె కూడా ఆ గది దాటి వెళ్లిపోయింది. వెళ్తున్న భార్యను అలా రెప్ప వాల్చకుండా చూస్తుండిపోయాడు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఖరీదైన బంగ్లా అది. తన గదిలో అతి సాంప్రదాయాల నీళ్లు తాగలేక చాలా ఏళ్లుగా శుష్కించిపోతున్నాడు రెహమాన్. రెహమాన్ ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు. ఆ కళను నమ్ముకుని దానికే జీవితం అంకితం చేసినవాడు. ఆ గది నిండా తనకు వచ్చిన ఎన్నో అవార్డులు, రివార్డులతోపాటు కూచిపూడి నాయిక గెటప్‌లో ఉన్న తన పెయింటింగ్స్, బొమ్మలు ఉన్నాయి. కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడైన సిద్ధేంద్ర యోగి విగ్రహంతోపాటు ఈ నృత్యాన్ని విస్తరించిన ప్రముఖుల చిత్రపటాలు, భరతుని నాట్యశాస్త్ర గ్రంథం వగైరాలన్నీ ఆ గదిలో పనికిరానివిగా పడున్నాయి. వాటినలా కలియజూస్తూ వెక్కుతున్నాడు. పక్కనే ఓ రెండుమూడు ఇనుప పెట్టెల నిండా ఉన్న కూచిపూడి నృత్య వస్ర్తాలు, నగలు, గాజులు, మేకప్ కిట్, బొట్టు బిళ్లలే కాకుండా సంగీత వాద్యాలు.. ఇలా అన్నింటినీ చేత్తో నిమురుతూ వెర్రివాడిలా ముఖం పెట్టాడు. ఇవన్నీ ప్రపంచానికి గొప్పగా కనిపిస్తున్నాయి.. తన ్లవాళ్లకు మాత్రం ఎందుకంత చీప్‌గా కనిపిస్తున్నాయో అర్థంకాకుండా ఉందతనికి! వెక్కుతూనే గతంలోకి వెళ్లాడు.
పద్ధతులు తు.చ. తప్పక పాటించే ఓ పేద ముస్లిం కుటుంబంలో పుట్టాడు రెహమాన్. పదిహేనేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యం మీద మక్కువ పెంచుకున్నాడు. నృత్యం నేర్చుకోవాలనుకునే విషయం ఇంట్లో చెప్పాడు. కూచిపూడి.. అందునా ఒక ముస్లిం మగపిల్లవాడై ఎలా నేర్చుకుంటాడు? అని ఇంట్లో అమ్మానాన్నలు, చుట్టాలు, బంధువులు ససేమిరా వద్దన్నారు, నవ్వుకున్నారు, చాటుమాటుగా ట్రోలింగ్ చేసుకుని ఆనందించారు. కొన్నిరోజులకు కూచిపూడి నృత్యమే తనకు ఆయువు నిలబెట్టేది.. నేర్చుకోకపోతే బతకలేనేమో అన్న స్థితిలోకి వెళ్లిపోయాడు రెహమాన్. దాంతో ఇంటికి దూరమయ్యాడు. ఎక్కడెక్కడో అనాథలా తిరిగి చివరికి హైదరాబాద్‌లో ఉండే ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు కళాధర్ అడ్రస్‌కు చేరుకోగా.. ఆయన ఆదరించారు. ఆయన శిష్యరికంలో కూచిపూడి నేర్చుకోవడం సహా పై చదువులు కూడా పూర్తిచేశాడు.
నృత్యంలో బాగా అలంకరించుకుని, నగలు ధరించాలి. పువ్వులు, గోరింటాకు పెట్టుకుని లక్ష్మీదేవిలా తయారవ్వాలి. అందుకోసం రెహమాన్ తనను తాను చాలా ట్రాన్స్పరెంట్గా మార్చుకున్నాడు. నిత్యం నీటుగా షేవ్ చేసుకోవడం, గోళ్లు, తల వెంట్రుకలు పెద్దగా పెంచడంతోపాటు డైట్ కంట్రోల్ చేస్తూ.. తన రూపాన్ని, మాటతీరును మహిళగా ఉండేలా మెయింటెయిన్ చెయ్యసాగాడు. కళకు అంకితమైనవాళ్ల కష్టాలు, త్యాగాలు పట్టనివాళ్లు.. అతని వాలకం చూసి ముఖం చిట్లించేవారు. ‘తేడా’ అంటూ రకరకాల పేర్లతో ఎగతాళులు, అవమానాలు, మరెన్నో సూటిపోటి మాటలతో హింసించేవారు. పైకి కనిపించే మేకప్‌ను చూసి.. ‘నువ్వు ఇదీ!?’ అని వీళ్లంతా ఎలా డిసైడ్ చేస్తారని చాలా బాధపడ్డాడు రెహమాన్. కానీ వాళ్లలోనే తనను విమర్శించేవాళ్లు, అక్కున చేర్చుకున్నవాళ్లున్నారు అనుకుని.. ఎంతపెద్ద విమర్శనైనా చిన్న చిరునవ్వుతో లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి.. దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ బిజీగా మారిపోయాడు. పేరు, డబ్బు, గౌరవం బాగానే సంపాదిస్తున్నాడు.
‘ఒక ముస్లిం పురుషుడు అయి ఉండి ఆడవేషంలో కూచిపూడి నృత్యమా?’ అని ఎందరో ముక్కున వేలేసుకున్నారు! ‘జాతిముత్యం’ అని తన కమ్యూనిటీ వాళ్లు కూడా కొనియాడతారని ఆశించి భంగపడ్డాడు! ఎందుకంటే వాళ్ల దృష్టిలో అలా కట్టుబొట్టులో నృత్యం చెయ్యడం నిషిద్ధం!? ఎదిగాక.. దూరంగా ఉంటూనే కన్నవాళ్ల కష్టనష్టాల్లో అండగా నిలిచాడు. తమ్ముళ్లు, చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. కానీ, తనకు మాత్రం ఎవరూ పిల్లనివ్వట్లేదు. ఎన్నో సంబంధాలు చూడగా అందరూ ఒకేమాట పదేపదే అన్నారు.‘ఆడేషం ఏసి గా డాన్సులు జేస్తుడేంది? అసలు వానికి పటేల్గిరీ ఉందా?’ అని!పెళ్లి సంబంధాలు కుదరక ఏజుబారు అవుతుంటే కుంగిపోసాగాడు. ‘నేను మొగోణ్నేరా బాబూ..’ అని ఈ లోకానికి ఎలా చాటి చెప్పాలని సతమతమయ్యాడు.చివరికి ఓ కార్యక్రమంలో పరిచయమైన మున్నీబీతో స్నేహం, ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. మున్నీబీ తొలుత రెహమాన్‌ను అర్థం చేసుకున్నట్టుగానే మసలుకుంది. కానీ ఒక కూతురు, ఇద్దరు కొడుకులు పుట్టాక ఆమె మారిపోయింది. సాంప్రదాయాలను అతని మీద రుద్దుతూ, నృత్యాన్ని వదిలెయ్యమని పోరు పెట్టసాగింది. ఆ వ్యతిరేకతను పిల్లలకూ నూరిపోసింది. దీంతో పిల్లలు కూడా తండ్రి నృత్యాన్ని అస్సలు ఇష్టపడేవాళ్లు కాదు.
మరోపక్క రెహమాన్ కెరీర్ పీక్స్‌లో కొనసాగుతోంది. ఎంతోమందికి ఈ విద్యను నేర్పిస్తున్నాడు. సినిమాల్లోనూ నటనకు, కొరియోగ్రఫీకి అవకాశాలు వస్తున్నాయి. నటనలో అవే ఆడ-మాడ వేషాలే ఇస్తున్నారు. బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు అలాంటి పాత్రలే ఇస్తుండటంతో.. ఇక నటించొద్దు అని నిర్ణయించుకున్నాడు. “ఇప్పటివరకు చేసిన డాన్సులు సాలు. ఆ పనిని ఇడ్సవెట్టి ఏదన్న యాపారం జేసుకుందాం” అంది భార్య.ఆ మాట వినగానే తనమీద పిడుగు పడ్డంత పనైంది. తన ప్రాణం ఉన్నంతవరకు కూచిపూడి నృత్యకారుడిగానే బతకాలని నిర్ణయించుకున్నవాడు. అలాంటి దాన్ని వదిలేసి వేరే పనంటే.. ఆ మరుక్షణమే అతని ఊపిరి ఆగిపోతుంది. కానీ, మతం తన మనసు మాట విననంటోంది! అయినా.. చచ్చినా కూచిపూడిని వదలనని కచ్చితంగా చెప్పాడు. దీంతో ఆమెకు మండిపోయింది. అదే అదునుగా భావిస్తూ ఆ ఇంటిని నరకంగా మార్చడంలో ఆమె బాగా పనిచెయ్యసాగింది.
పద్మశ్రీ సహా వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి ఎన్నో అవార్డులు, ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్న ఫొటోలు, ప్రశంసా పత్రాలు, పతకాలను ఇంటి హాల్లో చక్కగా అమర్చుకుని.. వాటిని చూసి మురిసిపోయేవాడు. తనకు అంబేద్కర్ అన్నా చాలా ఇష్టం. ఆయన ఫొటోను కూడా తన అవార్డుల స్థానంలో పెట్టుకుని ఆరాధిస్తాడు. అయితే మున్నీ ఓరోజు ఆ అవార్డులన్నింటినీ తీసేసి లోపలి గదిలో పెట్టించేసింది. అదేంటని ప్రశ్నిస్తే.. “మన ఆచారం ప్రకారం ఇంట్ల ఫొటోలు, బొమ్మలు పెట్టొద్దు. పెడ్తే ఫరిష్తేలు రారు” అంది.ఆ చర్యతో తన అస్తిత్వం చెరిగిపోయి వెన్నుముక విరిగినంత పనైంది. అప్పటినుంచి ఆ గదే అతనికి శాశ్వత అడ్డాగా మారిపోయింది. ఆ ఫొటోలను, పతకాలను చూసుకుంటూ.. ఆ జ్ఞాపకాలను వల్లెవేసుకుంటూ ఆ గదే తనదైన ప్రపంచంగా ఉండసాగాడు.
ఆలోచనల్లోంచి బయటకు వచ్చి చేతిలో ఉన్న పట్టు వస్ర్తాలను మురిపెంగా చూసుకున్నాడు. మనసుకు ఎప్పుడు బాధ కలిగినా ఆ గది తలుపులు మూసేసి.. గెటప్ వేసుకుని అద్దం ముందు కూచిపూడి నృత్యం చేస్తూ తనలో కళ ఇంకా చచ్చిపోలేదని సంతృప్తి చెందడం అలవాటు. కానీ, అప్పటిలా ఇప్పుడు వయసు లేదు కాబట్టి ఎక్కువసేపు నృత్యం చెయ్యలేక ఆయాస పడిపోతుంటాడు. ఇప్పటికీ అక్కడిక్కడ కొన్ని కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పిలిస్తే వెళ్తుంటాడు. కుటుంబానికి ఏ లోటూ రాకుండా చూసుకుని పిల్లలను బాగా చదివించాడు. పెద్దవాణ్ని తన అభీష్టానుసారం ఆలీమ్ కోర్స్ చదివించింది మున్నీబీ. ఆ చదువు తిండి పెట్టదన్నా వినకుండా.. బలవంతంగా మదర్సాలో వేయించింది. రెండోవాడు, అమ్మాయి ఇంజినీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ముగ్గురు పిల్లలకు తనలా ప్రొగ్రెసివ్ ఆలోచనలు అంటకుండా పూర్తి సాంప్రదాయిని సుబ్బినీల్లా పెంచింది మున్నీబీ.
అలా ఆ రాత్రంతా ఆ గదిలోనే ఒంటరిగా ఉండిపోయాడు. ఎనిమిదింటికి మున్నీబీ తెచ్చి అక్కడ విసురుగా పెట్టి వెళ్లిన భోజనం కూడా రుచించట్లేదని.. బాధనే ఆరగించి కళ్లు భారంగా మూసుకున్నాడు. మర్నాడు ఇంట్లో ఎవరూ మాట్లాడట్లేదు. దీంతో యాైంగ్జెటీ ఎక్కువై బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయి. ఘడియ ఘడియకి గుండెల్లో కలుక్కుమన్నట్టు అవుతోంది. వాళ్లను ఎదిరించి ఉండలేడు. ఒకరి మీద ఆధారపడాల్సిన వయసులో ఉన్నానని బాగా ఆలోచించాడు.‘ఇన్ని రోజులు నాకు నచ్చినట్టు బతికిన. ఇగనుంచి వాళ్లకు నచ్చినట్టు నటిస్తా’ అనుకుని రాజీపడ్డాడు.మనసు చంపుకొని మర్నాటి నుంచి షేవింగ్ చేయడం మానుకున్నాడు. రెండ్రోజులకే రెహమాన్ ముఖం మీద మొలుస్తున్న గెడ్డం, మీసాలను చూసి భార్యాకొడుకులు తెగ ఆనందించసాగారు. తమ పంతం నెగ్గిందన్న సంబరం అంతా ఇంతా కాదు! తానెంతో అపురూపంగా పెంచుకున్న తల వెంట్రుకలను నిర్దాక్షిణ్యంగా కత్తిరించుకున్నాడు. అలా ఆర్నెల్లకే జానెడు పెరిగింది గెడ్డం. ప్యాంటు షర్టు స్థానే.. పది జతల లాల్చీ పైజామాలు తెప్పించారు. నమాజ్ చదువుతున్నాడు. తానేదో జులాయి తిరుగుళ్లు తిరుగుతుంటే.. పట్టుకొచ్చి కర్ర పట్టుకుని సెట్ చేసినట్టుగా ఉందతని నిలువుదృశ్యం! ఆ రూపంలో తనకుతానే కొత్తగా, వింతగా అనిపిస్తున్నాడు.
ఓరోజు ఢిల్లీలో తన సమకాలిక నృత్యకారుడైన అమర్నాథ్ చనిపోయాడని తెలిసింది. కొడుకును తీసుకుని బయలుదేరి వెళ్లాడు. మిత్రుణ్ని తలుచుకుని కుమిలికుమిలి ఏడ్చాడు. అంత్యక్రియలు ముగియగానే తిరుగు ప్రయాణమవుతూ.. ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో క్యాబ్ దిగిపోయి నడుస్తూ కాస్త దూరం వెళ్లారు. దాహంగా ఉందని చెప్పడంతో.. అద్నాన్ వాటర్ బాటిల్ తీసుకురావడానికి అటువైపుగా వెళ్లాడు. ఆలోపే అక్కడ కొన్ని అల్లరి మూకలు ‘జైదేవా’ నినాదాలు చేస్తూ గెడ్డంలో ఉన్న రెహమాన్‌ను చూడగానే దగ్గరికొచ్చారు.
“జైదేవా అనరా సాయెబు” అంటున్నారు హిందీలో.వాళ్ల అమర్యాద రెహమాన్‌కు చిరాకు తెప్పించింది. ఏం అర్థంకాలేదు. వదిలేలా లేరని.. “దేవులవారికి వందనాలు” అన్నాడు. అయినా వాళ్లు సంతృప్తిపడలేదు.“ఏంట్రా జైదేవా అనలేవా?” అన్నాడొకడు రెహమాన్ గెడ్డాన్ని పీకుతూ. గెడ్డం పెరగడంతో తానొక ప్రముఖ వ్యక్తినని వారికి తెలీట్లేదు.“ఒక ధార్మిక నినాదాన్ని నాతోని బలవంతంగా ఎట్ల అనిపిస్తరు? మీకు అంతగానం భక్తి పొంగి పొర్లితే.. పోయి భజన చేస్కోర్రి. అంతేగనీ బల్మీటికి నాతోని అనిపియ్యమని ఆ దేవుడు ఏమన్న ఆజ్ఞ జారీ చేసిండా? అయినా మీరు అనమన్నట్టే నేనెందుకు అనాలి? జై ఇన్సాన్.. జైభీమ్!”.. అన్నాడు రెహమాన్. తాము అనమనట్లు అనలేదని వాళ్లందరికీ బాగా మండిపోయింది. బండ బూతులు తిడుతూ రెహమాన్‌పై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టసాగారు. చుట్టూ గుమిగూడిన వాళ్లలో ఒక్కరూ వాళ్లను అడ్డుకోలేదు. ఆ బాధ భరించలేక ‘జైదేవా’ అనేశాడు. శాంతించిన వాళ్లు.. జైదేవా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. దెబ్బలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని చూసి.. అద్నాన్ పరుగెత్తుకొచ్చాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు.
గాయాల నుంచి నెల రోజులకు కోలుకున్నాడు రెహమాన్. ఏమాత్రం సంకోచించకుండా గెడ్డం, మీసాలు గీక్కుని.. మునుపటిలా ప్యాంటు-షర్టు వేసుకుని ఏ మతం అంటుకోని మహా మనిషిలా హాల్లోకి వచ్చాడు. ఆయన్ని అలా చూసి ఇంట్లోవాళ్లంతా షాకయ్యారు! “ఏమైంది నీకు? దయ్యం వట్టిందా ఏమి?” అడిగింది మున్నీబీ.“పట్టిన దయ్యం వదిలింది. గా గడ్డం లేకుంటే.. నాకు గాళ్ల చేతుల్ల దెబ్బలు తప్పేటియి గదా?” అన్నాడు.
“ఏంది పప్పా! గాల్లెవరో కొట్టిర్రని గడ్డం తీసేస్తవా? గంత నాదానా నీ ఇమాన్?” అంటున్న కొడుకు బుర్రలో కట్టుకున్న మట్టిగూడును ఎలా తొలగించాలో ఆయనకు అర్థం కావట్లేదు.“మానవత్వం గట్టిగా ఉండాలె. ఇమాన్ నాదాన్ ఉన్నా ఏంగాదు. ఇప్పుడు భక్తి పేరిట పోకిరీ వేషాలు ఎక్కువైనయ్ బిడ్డా! గడ్డం సాయెబు రోడ్డు మీద కనిపిస్తే జోకర్ లెక్క చిడాయిస్తున్నరు. మీరేమో గెడ్డం వెంచుడే సొక్కం అంటున్నరు. నేను గడ్డంల ఉండంగ గాళ్లు నన్ను కొడుతున్నా సీన్మ జూశిన గాయన కోసం నేనింకా గడ్డం పెంచలేను. ఆయనకు గురాతనం ఉంటే పెరుగుతున్న ధరలను కంట్రోల్ చెయ్యమను! ప్రభుత్వ ఆస్తులను కాపాడుమను! ఈ దేశ లౌకికత్వాన్ని రక్షించమను! మతం నిండిన చెహ్రా నాకద్దు.. మనిషితనం నిండిన మొకమే కావాలె. కులమతాలు మనుషులను ఏరువడేస్తుంటే.. అవేవీ కాదు మనుషుల్ని మనుషులుగా సూడాల్నని చెప్పిన గీ మనుషుల్ల దేవుణ్ని నాతోపాటు తీస్కపోతున్న. మతమెక్కినోళ్లను, మామూలోళ్లను కాపాడే ఏకైక దేవుడు గీననే. గీన రచించిన రాజ్యాంగమే నాకు పవిత్ర గ్రంథం” అంటూ.. తన చంకలో ఉన్న అంబేద్కర్ ఫొటోను, రెండు చేతుల్లో ఉన్న రాజ్యాంగాన్ని, సిద్దేంద్ర యోగి విగ్రహాన్ని ఆరాధనగా చూసుకున్నాడు.
అద్నాన్కు ఏం జరుగుతుందో అర్థంకాకుండా ఉంది. మళ్లీ తనే కంటిన్యూ చేస్తూ.. “నేను ఈ ఇంట్లకెల్లి శాశ్వతంగా బయటకు వోతున్నా. నేను జమ జేసుకున్న పైసలతోని ఓ వృద్ధాశ్రమం వెట్టి.. నా అసుంటోళ్లకు ఆదెరువుగ నిలుస్తా. గిదే నా ఆఖరి నిర్ణయం” మరో మాటకు ఆస్కారం లేకుండా రెహమాన్ ఇంటి బయటకు వచ్చి కారులో వెళ్లిపోయాడు.
హుమాయున్ సంఘీర్
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా.. బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు హుమాయున్ సంఘీర్. స్వస్థలం కామారెడ్డి జిల్లా గోపాల్పేట్ గ్రామం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ.. సినిమాల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకూ 60 కథలు, 4 నవలలు రాశారు. వివిధ కథలు, నవలల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం కథలపోటీ-2022లో ‘ఇబ్లీస్’ కథకు మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఉషా పత్రిక-సుజనా ఫౌండేషన్ నవలల పోటీలో ‘కళంకం’ నవలకు బహుమతి అందుకున్నారు. కామునికంత, ఇల్లింతపండ్లు, మేరా బాప్ ఖయ్యూం పేరుతో కథా సంపుటాలను వెలువరించారు. కామునికంత పుస్తకానికి కొలకలూరి భాగీరథీ పురస్కారం-2023, ఇల్లింతపండ్లు పుస్తకానికి డా.వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం-2024 దక్కించుకున్నారు. రెండు సినిమాలకు రచనా సహకారం, ఒక సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. 40 షార్ట్ ఫిల్మ్స్‌లో చేశారు. కొన్నిటికి కథలు రాసి, నటించి, దర్శకత్వం వహించారు. మూలుగుబొక్క, 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్, దొరసాని సినిమాలో నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
-హుమాయున్ సంఘీర్
94411 17051