కొవిడ్‌కు ముందు దేశంలో దాదాపు 80 శాతం మెడికల్ కిట్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేంది. దేశంలోనే మెడికల్ కిట్స్ ఎందుకు ఉత్పత్తి చేయరాదు? అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి పరిశోధనలకు ప్రోత్సాహం అందించింది. కొవిడ్ సమయంలో రూ.6 వేలు ఉన్న మెడికల్ కిట్స్ ఇప్పుడు సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ రూ.12కే అందిస్తున్నది.
– కేటీఆర్
పటాన్చెరు, అక్టోబర్ 17 : పరిశోధన ఫలాలు సామాన్యులకు అందాలని కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కులను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) గుర్తుచేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులోని హ్యూవెల్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ‘లైయోబీడ్స్, పోర్టబుల్ మినీ ఆర్టీ, పీసీఆర్ పరికరాలను ఆవిష్కరించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ సామాన్యులకు వైద్య పరికరాలు అందుబాటు ధరల్లో ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల క్రితం సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇక్కడ పార్క్ ఏర్పాటుకు ముందు అడవి, కంకర క్రషర్లు ఉండేవని గుర్తుచేశారు.
పరిశ్రమలు, మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు కోసం తక్కువ ధరకే బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడిక్కడ కొత్త పరిశోధనలు చేసి సామాన్యులకు అందుబాటు ధరల్లో మెడికల్ కిట్స్‌ను అందించడం సంతోషంగా ఉన్నదని చెప్పా రు. కొవిడ్‌కు ముందు రూ.6 వేల దాకా ఉన్న మెడికల్ కిట్స్‌ను తెలంగాణలో ఉత్పత్తి చేసి రూ.12కే అం దిస్తుండటంతో సామాన్యులకు మేలు జరిగిందని తెలిపారు. మెడికల్ డివైజ్ పార్కులో వందల పరిశ్రమలు ఏర్పాటు చేసి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. కరోనా కాలంలో హ్యూవెల్ సంస్థ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, అప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వ్యాపారవేత్తలను మరింత ప్రోత్సహిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శాస్త్రవేతలు కొత్త పరిశోధనలు చేసి మెడికల్ పరికరాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా రూపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మ భూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి (శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు), డాక్టర్ హరీశ్ లయన్, డాక్టర్. శశిధర్, డాక్టర్ రాకేశ్ మిశ్రా, డాక్టర్ లక్ష్మ వేమా పాల్గొన్నారు.
మెడికల్ డివైజెస్ పార్కులో కొత్త పరికరాల ఆవిష్కరణకు వచ్చిన కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం కలికారు. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ సమీపంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పటాకులు పేల్చి ఘనంగా స్వాగతించారు. ఇక్కడ జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, అంజయ్య, ఐలాపూర్ మాణిక్ యాదవ్, కృష్ణ, నవీన్, రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.