‘మనకు నష్టం జరిగినా పర్వాలేదు. బీఆర్ఎస్ను మాత్రం గెలవనివ్వొద్దు!’ ఇదే అంతర్గత సూత్రంతో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఇరుపార్టీల ధోరణి.. తెరవెనుక ఏం జరిగిందో తేటతెల్లం చేస్తూనే ఉన్నది. రెండు పార్టీల నేతలు మిలాఖత్ అయ్యారని, అందుకే బీజేపీ ఉత్తుత్తి పోటీకి దిగిందని సమాచారం.
ఆ మేరకు ‘డమ్మీ’ అభ్యర్థిని రంగంలోకి దింపిన బీజేపీ నాయకత్వం.. కనీసం ప్రచారానికైనా అటువైపు చూడటం లేదని సమాచారం. పోటీకి ముందే ఓటమిని ఒప్పుకున్నట్టు, బీజేపీ నాయకత్వం వ్యవహరించడం వెనుక.. ఇద్దరు ముఖ్యనేతల మధ్య ‘రియల్ ఎస్టేట్ సంస్థలు, భూములకు సంబంధించిన పర్మిషన్ల ‘డీల్’ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. రెండు జాతీయ పార్టీల తెరవెనుక ఒప్పందంపై జూబ్లీహిల్స్ ఓటర్లు విస్తుపోతున్నరు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. అధికార పార్టీని దెబ్బతీసేందుకు వివిధ వర్గాలు స్వతంత్రంగా బరిలో దిగుతున్నాయి. హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలో ఒక్క బీజేపీ మాత్రమే తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఉప ఎన్నికతో తమకేం సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నది. చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేయడం, ముఖ్యనేతలంతా ప్రచారానికి దూరంగా ఉండటంతో బీజేపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారని బీజేపీ నేతలు, కార్యకర్తలే విమర్శిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 26 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు పెరిగాయి. అయినా ఈ సీటును బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన ‘ముఖ్యనేత’లు దోస్తీ కట్టారని, వారి మధ్య ‘రియల్’ ఒప్పందం కుదిరిందని బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. తమ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదుకానీ తనకు లాభం కలగాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ ముఖ్యనేత కాంగ్రెస్ ముఖ్యనేతతో చేతులు కలిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలు వేరైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక వేదికగా పరస్పర అవగాహన ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
చివరి నిమిషంలో..
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాధ్‌ను ప్రకటించగా, కాంగ్రెస్ కొంత ఆలస్యంగా నవీన్యాదవ్ను ప్రకటించింది. కానీ, బీజేపీ మాత్రం తాత్సారం చేసింది. ఒప్పందంలో భాగంగానే బీజేపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేయడంలో చివరి నిముషం వరకు అలసత్వం ప్రదర్శించారని, చివరికి క్యాండిడేట్ ఎంపికలో పార్టీ అధ్యక్షుడిని కూడా లెక్కలోకి తీసుకోకుండా అంతా తానై వ్యవహరించారని అంటున్నారు. గడువు ముగుస్తున్న సమయంలో లంకల దీపక్‌రెడ్డిని ప్రకటించి, అతడికి ప్రచారానికి సమయమే లేకుండా చేశారని పార్టీ క్యాడర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మొత్తంగా తమ పార్టీ ద్వారా నామమాత్రంగా అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని మండిపడుతున్నారు. తమ రియల్ఎస్టేట్ కంపెనీలకు, భూములకు పర్మిషన్లు ఇప్పించుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తాకట్టుపెట్టారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ ముఖ్యనేతపై మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంపై ఆగ్రహంగా ఉన్న నియోజకవర్గ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎలాగైనా ముఖ్యనేతకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసి, విడతలవారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బీఆర్ఎ స్వైపు కాషాయ శ్రేణులు
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యనేతతోపాటు రాష్ట్ర నాయకత్వం వైఖరితో బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొన్నది. తమ నేత ఏకంగా కాంగ్రెస్ ముఖ్యనేతతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారని, తన ప్రయోజనానికి పార్టీని వాడుకుంటున్నారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రియల్ఎస్టేట్లో పలు కంపెనీలకు పర్మిషన్లు ఇప్పించుకోవడంతోపాటు చాలాచోట్ల భూముల వ్యవహారంలో ఇద్దరు ముఖ్య నేతలు కలిసి పెద్ద ఎత్తున దందా చేస్తున్నారంటూ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. బీజేపీ అధ్యక్షుడిని సైతం పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం తానై చక్రం తిప్పుతున్నారని మండిపడుతున్నారు. అభ్యర్థి దీపక్‌రెడ్డి సైతం తనను నామమాత్రంగా ఎంపిక చేశారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. తనకు కనీసం ప్రచారం చేసుకునే సమయం లేకుండా చేశారని, అగ్రనాయకులెవరూ సహాయం చేయడంలేదని, ఇది ముఖ్యనేత ప్లాన్‌లో భాగంగానే జరిగిందని సన్నిహితుల వద్ద వాపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ తమ సభ్యత్వాలకు, పదవులకు రాజీనామా చేస్తున్నారు.
ఇన్నాళ్లూ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా భుజాలపై మోసిన పార్టీని వదిలేయడం ద్వారా ముఖ్యనేతకు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు. ప్రధానంగా హస్తం, కమలం ముఖ్యనేతల మధ్య ఒప్పందం ద్వారా కమలం పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి తన స్వార్థం చూసుకుంటున్న ముఖ్యనేత వ్యవహారాన్ని బహిరంగంగానే ఎండగడుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ పోరాడుతున్న బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వరుసగా సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. గతంలో కార్పొరేటర్‌గా పోటీచేసిన బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ చెరక మహేశ్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీగూటికి చేరారు. మరికొందరు ముఖ్యనేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహిళామోర్చా జిల్లా స్థాయి నాయకులు, డివిజన్ల వారీగా కాషాయ ముఖ్యనేతలు పెద్ద ఎత్తున గులాబీబాట పడుతున్నారు.