Bigg Boss 9| బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరో వారం ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేసింది. పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మధ్య మాటల యుద్ధం, డ్రామా, ఎమోషన్లతో హౌజ్ సందడి చేసింది. ముఖ్యంగా దివ్వెల మాధురీ ఎంట్రీ తర్వాత హౌజ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆమె రూల్స్ సెట్ చేస్తూ, డిక్టేటర్లా వ్యవహరిస్తూ హౌజ్‌ను తన అధీనంలో ఉంచుతోంది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ టాస్క్‌లో మూడు జంటలు పోటీ పడ్డాయి. సుమన్ శెట్టి-గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురీ-ఆయేషా, రమ్య-శ్రీనివాస సాయి మూడు జంటలుగా విడిపోయి “శవపేటిక టాస్క్”లో తమ లాక్ కనుక్కొని గంట కొట్టే ఛాలెంజ్ పాల్గొనాల్సి ఉంటుంది.
మొదటగా ఆయేషా ప్రయత్నించినా లాక్ తీయలేకపోయింది. కానీ గౌరవ్ గుప్తా తన పార్టనర్ సుమన్ శెట్టి లాక్ తీయగలిగాడు. దీంతో ఈ జంట విజేతలుగా నిలిచింది. బిగ్ బాస్ తొలిసారిగా ఇద్దరిని సంయుక్తంగా కెప్టెన్లుగా ప్రకటించడం హౌజ్‌లో సంచలనం సృష్టించింది. దీంతో ఏడో వారానికి సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా ఇద్దరూ కెప్టెన్లుగా హౌజ్ బాధ్యతలు చేపట్టారు. కెప్టెన్సీ బ్యాడ్జ్ ధరించిన తర్వాత సుమన్ శెట్టి “నీతితో, నిజాయితీతో ఉంటాను” అంటూ ప్రమాణస్వీకారం చేశాడు. ఆ వెంటనే “అధ్యక్షా!” అంటూ తన తొలి చిత్రం జయం ని గుర్తు చేసేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని ఉత్సాహానికి ఇమ్మాన్యుయెల్ కూడా ఫిదా అయ్యారు..
ఇక టాస్క్‌లో తాను ముందుగా వచ్చినా లాక్ తీయలేకపోయానని అయేషా ఎమోషనల్ అయ్యింది. ఫెయిల్ అయినందుకు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే కెప్టెన్లు సుమన్ శెట్టి, గౌరవ్ ఆమెకు బెడ్ ఇచ్చి ఓదార్చడంతో ఆమె మనసు కొంచెం సాంత్వన పొందింది. ఇక ఎపిసోడ్ మధ్యలో కిచెన్ ప్రాంతంలో ఆయేషా, జీనత్, రీతూ చౌదరీల మధ్య పనులపై ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో పవన్ కూడా జోక్యం చేసుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. మొత్తానికి 40వ ఎపిసోడ్ డ్రామా, ఎమోషన్, హాస్యం, సర్‌ప్రైజ్‌ల మేళవింపుతో సాగింది. వచ్చే ఎపిసోడ్లో జంట కెప్టెన్సీ ఎలా పనిచేస్తుందో చూడాలి.