న్యూఢిల్లీ, మార్చి 19 : తమ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఖతార్‌కు చెందిన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంలోని ఇంధన సదుపాయంపై ఇరాన్ జరిపిన దాడి ముడి చమురులో 88 శాతం, గ్యాస్‌లో 50 శాతం వరకు దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు చేదు వార్త కానున్నది. భారత్‌కు అతి పెద్ద సరఫరాదారైన ఖతార్ నుంచి వచ్చే గ్యాస్ దిగుమతులకు ఇదివరకే అంతరాయం ఏర్పడింది. భారత్‌కు అవసరమైన ఎల్పీజీలో మూడవ వంతు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ)లో దాదాపు సగం దిగుమతులు ఖతార్ నుంచే వస్తాయి.
అమెరికా-ఇజ్రాయెల్‌పై తన ప్రతీకార దాడులను ఉధృతం చేసిన ఇరాన్.. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతి భారీ ఎల్ఎన్జీ ప్లాంటుపై దాడి చేసింది. ఇదివరకు హొర్ముజ్ జలసంధి అడ్డగింత కారణంగా ఏర్పడిన రవాణా సమస్యలు మాత్రమే భారత్‌ను బాధించాయి. ఇది కేవలం తాత్కాలిక సమస్యగానే భారత్ భావించింది. అయితే ఇప్పుడు రాస్ లఫాన్ గ్యాస్ సదుపాయానికి జరిగిన నష్టం భారత్‌కు పెను సమస్య కానున్నది. ఇప్పుడు ఆ సదుపాయంలో జరిగిన నష్టానికి మరమ్మతులు చేయడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఒకవేళ యుద్ధం ముగిసినా లేక ఆంక్షలు సడలినా రాస్ లఫాన్ నుంచి ఎల్ఎన్జీ, పీఎన్జీ సరఫరాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.
పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్(పీఎల్ఎల్), గెయిల్ ఇండియా, జీఎస్పీసీకి గ్యాస్ సరఫరాకు సంబంధించి ఖతార్‌తో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నాయి. పీఎల్ఎల్ ఖతార్ నుంచి ఏడాదికి 75 లక్షల టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్నది. జీఎస్పీసీ, ఎంటీపీఏ, గెయిల్ కలిసి 10 లక్షల టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్నాయి.