న్యూఢిల్లీ, మార్చి 19 : హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన వ్యక్తి ఒకరు గురువారం వెల్లడించారు. ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హొర్ముజ్ జలసంధిపై పూర్తి పట్టును ప్రదర్శిస్తున్న ఇరాన్ దీన్ని సొమ్ము చేసుకోవాలని యోచిస్తున్నది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత హొర్ముజ్ గుండా జరిగే నౌకల ప్రయాణాన్ని ఇరాన్ పూర్తిగా అడ్డుకుంది. నౌకాయానం, ఇంధన రవాణా, ఆహార సరఫరాల కోసం జలసంధి వాడుకుంటున్న దేశాలు ఇరాన్‌కు పన్నులు, టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్న ప్రతిపాదిత బిల్లును పార్లమెంట్ పరిశీలిస్తున్నట్లు ఆ నాయకుడు చెప్పారు.
ఇరాన్ సుప్రీం నాయకుడి సలహాదారు ఒకరు మాట్లాడుతూ యుద్ధం అంతిమంగా ముగిసిన తర్వాత హొర్ముజ్ జలసంధికి ఒక కొత్త పాలనా వ్యవస్థ ఏర్పడుతుందని, ఇది తమపై ఆంక్షలు విధించిన దేశాలపై సముద్రపరంగా పరిమితులను విధించడానికి ఇరాన్‌కు వీలు కల్పిస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత జలసంధి సమీపంలో కనీసం 20 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. చమురు ట్యాంకర్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి.ఈ ఘటనలతో జలసంధి గుండా ప్రయాణించడానికి అనేక నౌకలు వెనుకాడుతున్నాయి. వందలాది నౌకలు జలసంధి సమీపంలో నిలిచిపోవడం లేదా రూటు మార్చుకుని వెనుదిరగడం జరుగుతున్నది. యుద్ధం వల్ల 1,000కి పైగా నౌకలు అడ్డగింతకు గురైనట్లు అంచనా.