న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో పిల్లలపై లైంగిక నేరాలు (Child Abuse Cases) 2017 నుంచి 2022 వరకు 94 శాతం పెరిగాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33,210 నుంచి 64,469కి పెరిగాయి. భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ శిక్షల విధింపు మాత్రం 90 శాతానికి కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇది మరింత బలమైన చట్టపరమైన చర్యలను, కేసుల నమోదు అవసరాన్ని సూచిస్తోంది. చైల్డ్లైట్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ రూపొందించిన 2025 నివేదిక ప్రకారం నేర గణాంకాలలో పారదర్శకత వల్ల కేసుల దర్యాప్తుపై పర్యవేక్షణ, సత్వర చర్యలకు వీలు ఏర్పడుతుంది.
పిల్లలపై లైంగిక నేరాలు ప్రపంచ స్థాయిలో మానవ విషాదంగా నివేదిక అభివర్ణించింది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు 2012లో పోక్సో చట్టం అమలులోకి వచ్చింది. 2017లో 33,210 పోక్సో కేసులు నమోదుకాగా 2022 నాటికి ఆ సంఖ్య రెట్టింపయ్యింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటే బాధితులు ఎంతమాత్రం మౌనంగా ఉండడం లేదని అర్థం చేసుకోవాలి. అయితే నమోదుకాని కేసులు కూడా ఇంకా ఎన్నో ఉండవచ్చు కూడా.
భారత్‌తోపాటు నేపాల్, శ్రీలంకలో జరిపిన సర్వేలలో 18 ఏళ్ల లోపు వయసు ఉన్న ప్రతి 8 మంది పిల్లలలో ఒకరు లైంగిక దాడికి లేదా అత్యాచారానికి గురవుతున్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. ఈ మూడు దేశాలలో దాదాపు 5.40 కోట్ల మంది పిల్లలు లైంగిక నేరాల బాధితులని నివేదిక తెలిపింది. ఈ మూడు దేశాల్లోని మొత్తం పిల్లల జనాభాలో ఇది 12.5 శాతమని నివేదిక వెల్లడించింది. 2024లో దక్షిణాసియాలోనే అత్యధిక చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్(సీఎస్ఏఎం) కేసులు భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో నమోదయ్యాయని, ఒక్క భారత్‌లోనే 22.5 లక్షల కేసులు నమోదయ్యాయని నివేదిక తెలిపింది.
కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగం పట్ల కూడా నివేదిక హెచ్చరించింది. 2023, 2024 మధ్య ఏఐ సృష్టించిన సీఎస్ఏఎం 1,325 శాతం పెరిగిందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సీఎస్ఏఎం పంపాలని ప్రధాన టెక్ కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో అటువంటి నేరాలను కనిపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. ప్రతి అంకె వెనుక ఓ చిన్నారి భద్రత, మానమర్యాదలు, భవిష్యత్తు ముప్పులో పడి ఉంటున్నాయని చైల్డ్లైట్ సీఈఓ పాల్ స్టాన్ఫీల్డ్ తెలిపారు.
పిల్లలపై జరిగే లైంగిక దాడులను ప్రజారోగ్య ఎమర్జెన్సీగా అన్ని దేశాలు పరిగణించాలని చైల్డ్లైట్ తన నివేదికలో పిలుపునిచ్చింది. హెచ్ఐవీ/ఎయిడ్స్, కొవిడ్-19 తరహాలోనే ఈ కేసులను కూడా అంతే ఎమర్జెన్సీతో వైద్య చికిత్సలు అందచేయాలని నివేదిక కోరింది.
దేశవ్యాప్తంగా 2022లో పిల్లలపై నేరాలకు సంబంధించి 1.77 లక్షల కేసులు నమోదయ్యాయి. 2022లో 1.62 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క ఏడాదిలోనే 9.2 శాతం పెరుగుదల ఉంది. ఇది మహిళలు, వృద్ధులపై జరిగే నేరాలతో పోలిస్తే చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 22,393 కేసులు నమోదయ్యాయి. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతిరోజు 486 కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి మూడు నిమిషాలకో నేరం జరిగిందని భావించాలి.