బయ్యారం, ఫిబ్రవరి 25 : ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని నిర్మాణాన్ని ప్రారంభిస్తే అటవీ శాఖ అధికారులు నిలిపి వేయాలని చెప్పడంతో ఏజెన్సీలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు మొదటి దశలో 557 మందికి ఇండ్లు మంజూరు కాగా, వివిధ దశల్లో నిర్మాణాలున్నాయి. వీటిలో బీరోనిమడవ, కారుకొండ, రెడ్యాతండా, అల్లిగూడెం, బోటితండా, దొరన్నతండా, బీమ్లాతండా, చింతల్తండా, పత్యతండా, సాంబతండా, ఇసుకమేది, రావికుంట, వినోభానగర్, సురేశ్నగర్, భద్రుతండా, పందిపాడు గ్రామాలు అటవీ శాఖకు చెందిన భూముల్లో ఉన్నాయి.
ఇక్కడి గిరిజనులు తాత ముత్తాతల కాలం నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఇటీవల అటవీ శాఖ అధికారులు 16 గ్రామాల్లోని 110 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రొటెక్టివ్ ఫారెస్ట్ (పీఎఫ్) భూముల్లో జరుగుతున్నాయని, వాటిని నిలిపివేయాలని లబ్ధిదారులను ఆదేశించారు. ఇకపై నిర్మాణాలు చేపట్టొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతేకాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీ హక్కుల సంరక్షణ చట్టం (1967), అటవీ సంరక్షణ చట్టం (1980) ప్రకారం లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దశాబ్ధాలుగా ఇక్కడే గుడిసెల్లో నివాసం ఉంటున్నామని, విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఓ వైపు గృహ నిర్మాణ శాఖ అధికారులు పనులు త్వరగా పూర్తి చేయాలంటుంటే, మరోవైపు అటవీ శాఖ నిలిపివేయాలంటుండడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని కొందరు లబ్ధిదారులు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతోనే అటవీ భూముల్లో చేపడుతున్న ఇంటి నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించామని ఫారెస్ట్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నిలిపేయాలని అటవీ శాఖ అధికారులు చెప్పి వెళ్లారు. సర్కారు ఇల్లు మంజూరు చేసిందని ఉన్న గుడిసె తీసేసి పక్కా ఇల్లు కట్టుకుంటున్నాం. ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తి అయింది. ఇప్పుడు వచ్చి అటవీ భూముల్లో ఇంటి నిర్మాణం జరుగుతుందని, నిలిపేయాలని అటవీ శాఖ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టొద్దంటే మే ఎక్కడికి పోవాలి.
– బానోత్ బుజ్జి, ధర్మపురం, బయ్యారం మండలం