James Neesham : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్(James Neesham) అంతర్జాతీయ క్రికెట్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup) తర్వాత అతడు రిటైర్మెంట్పై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గురువారం నీషమ్ స్వయంగా వెల్లడించాడు.
‘నేను దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోను. నా ఏకైక లక్ష్యం న్యూజిలాండ్‌కు టీ20 ప్రపంచకప్ అందించడమే. ఆ తర్వాత నేను అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటా. న్యూజిలాండ్ తరఫున ఆడాలా? లేదా మొత్తానికి టీ20లు మాత్రమే ఆడాలా? అనేది ఆలోచిస్తా’ అని నీషం వెల్లడించాడు.
జేమ్స్ నీషమ్
‘ఒక ఆల్‌రౌండర్లు 35 నుంచి 36 ఏండ్ల వరకు ఆడగలరు. ఇది నిజంగా గొప్ప విషయం. అందకని మరో మూడేండ్లు నేను ఫిట్‌గా ఉండడంపై దృష్టిపెడుతా. ఆలోపు గాయాల బారిన పడకూడదని, ఆడినన్ని రోజులు జట్టును గెలిపించాలని భావిస్తున్నా’ అని నీషమ్ తెలిపాడు. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో నీషమ్ అద్భుతంగా ఆడాడు. అయితే.. సూపర్ ఓవర్లో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ముంబై ఇండియన్స్ టీమ్‌తో నీషమ్
కానీ, ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్ అనూహ్యంగా రనౌట్ కావడంతో ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ప్రస్తుతం నీషమ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగాపూర్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీ20 లీగ్స్‌లో పాపులర్ అయిన ఐపీఎల్లో నీషమ్ పలు జట్లకు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్, 2020లో కింగ్స్ లెవన్ పంజాబ్, 2021లో ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 8 తేదీన జరిగే మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్‌తో కివీస్ తలపడనుంది.