డెహ్రాడూన్ : ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్‌లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
బద్రీనాథ్ ఆలయం సైతం మంగళవారం ఉదయం తెల్లవారు జామున 4.15 గంటలకు బ్రహ్మముహూర్తంలో తిరిగి తెరవనున్నారు. ఆలయం గత నవంబర్ 16న మూసివేశారు. చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చలికాలంలో మూసివేస్తుండగా.. మళ్లీ ఆరు నెలల తర్వాత ఏప్రిల్ – మే మధ్యలో తెరుస్తారు. ఆలయాల పునః ప్రారంభానికి సన్నాహాలు వారం కిత్రమే చార్ధామ్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రాంగణాల వద్ద మంచు తొలగింపు పనులు చేపట్టింది.
పారిశుధ్యం పనులు పూర్తి, చేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం తెలిపింది. యాత్రికులకు అవకాశం కల్పించడం లేదని, కేవలం ఆలయంలో ఆచారాలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కేదార్నాథ్ ఆలయాన్ని ఆచారాలతో తిరిగి తెరిచినట్లు సీఎం తీరత్ సింగ్ రావత్ తెలిపారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని కేదారేశ్వరున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Uttarakhand | Portals of Kedarnath temple open; visuals from the opening ceremony that was held at 5 am today pic.twitter.com/PmgqbsgQ8u
— ANI (@ANI) May 17, 2021