Vaasthu | ‘వాస్తు’ అనేది వ్యాపారమే కదా? లేకుంటే ఆలోచన కలిగిన మనిషిని.. మట్టి – నీళ్లు ఎలా బాగు చేస్తాయి చెప్పండి?
– ధీరేంద్ర కుమార్, కుకునూర్‌పల్లి
ప్రశ్న ఘాటుగా ఉన్నా.. సమాధానం చెప్పాల్సిందే! ఎందుకంటే.. ఇలాంటివాళ్లు అన్నిచోట్లా ఉన్నారు. వీళ్లకు ప్రమాణం కావాలి. హేతువు ఉండాలి. చూస్తేనే నమ్ముతారు. చాలామందికి కొన్ని వాస్తవాల గురించి ఆలోచించే మనస్తత్వం ఉండదు. మనిషి తలలో మెదడు ఉంది. అది అనేక ఆలోచనలకు తోడ్పడే ఒక భాగం. అది శరీరంలో నిర్మాణమై ఉంది. కానీ, మొదట దాని పని విధానం చూసినవారెవరు? అది తెలిసినవాడు మొదట నమ్మకపోయి ఉంటే.. మెదడు పనితీరును నేడు యంత్రాల ద్వారా చూడలేకపోయేవాళ్లం కదా! మనం ఒక సత్యాన్ని తప్పక అవగాహన చేసుకోవాలి. ‘భౌతికమైన నిర్మాణ రీతికి, దాని జీవన చర్యలకు మధ్యన.. మనిషికి అర్థంకాని అగాథం ఉంది’ అంటాడు ల్యాట్ వాట్సన్. సృష్టి నిర్మాణ విధానానికి, చుట్టూ జరిగే అనేక సంఘటనలకు మధ్య ఉన్న అంతర్లీన సంబంధం చాలా క్లిష్టమైంది. దానిని వెల్లడి చేయడానికి ఆధునిక పరికరాలు సరిపోవు. ఇది సత్యం. మనకు అర్థంకానంత మాత్రాన అది సరైనది కాదు అనుకోవడం అవివేకం. మనిషి ఆలోచనాపరుడే. బుద్ధి జీవుడే! కానీ, ఆ బుద్ధి, ప్రజ్ఞ అన్ని సమయాల్లో పనిచేస్తుందా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది బలహీనమే కదా! మెలకువలో కూడా.. మరుక్షణంలో ఏం జరుగబోతున్నదో తెలుసుకోలేడు కదా! ఎంత అత్యాధునిక యంత్రాలు వచ్చినా.. ఈ అనంత ప్రకృతి ముందు అతను పసిగుడ్డే! అతని బుద్ధిబలం పరిమితమే! పిడికెడు మట్టిని, దానిలోని అణువులను ప్రేరేపిస్తే కనుక, ఒక పెద్ద కొండ తునాతునకలు అవుతుంది. చల్లగా పారే నది కూడా నీరే.. విశాలమైన భవనాలను, మట్టి నేలలను తెగ కోసి పోతుంది. పంచభూతాలు ఏవైతే బయట ఉన్నాయో, అదే వస్తు సామగ్రితో పుట్టిన మనిషి.. నేను వేరు, సృష్టివేరు, ప్రపంచం వేరు అనుకుంటే శాస్త్రం అర్థంకాదు. వాస్తు వ్యాపార వస్తువే అయితే.. ఇన్ని యుగాలుగా బతికి ఉండేదే కాదు.
మా ఇంటిని రెండు భాగాలు చేసి, ఒక పోర్షన్ అద్దెకు ఇవ్వాలి అనుకుంటున్నాం. అప్పుడు, మేం ఏ దిక్కున ఉండాలి?
– డి. మీనాకుమారి, కామారెడ్డి
ఇంటిని విభజించి అద్దెకు ఇవ్వడం మంచి పద్ధతికాదు. ‘మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇవ్వక తప్పదు!’ అంటారేమో.. అలాంటప్పుడు ఒక ఫ్లోర్ పూర్తిగా అద్దెల కోసమే కట్టండి. ఒక ఫ్లోర్ మొత్తం మీరే ఉండండి. ఇల్లు ఆవు శరీరం లాంటిది. అది గడ్డి తింటేకానీ, పాలు ఇవ్వదు. పూజనీయ జీవి. దానిని రెండు భాగాలు చేసి, పాలు వచ్చే భాగం నేను ఉంటాను అంటే.. ఫలితం ఉంటుందా? ప్రాణం ఉండని నిర్జీవ గృహంగా ఇంటిని రెండు ముక్కలు చేయకూడదు. ఒక ఇంటికోసం చేసిన పథకం.. రెండు ఇండ్లుగా మారదు. అది తీవ్ర ఫలితాలను ఇస్తుంది. మీరు ఎటుదిక్కు ఉన్నా.. అయితే ఈశాన్యం పోతుంది లేదా నైరుతి పోతుంది. ఒక పూర్ణ గృహం నైరుతి – ఈశాన్యాలను కలిగి ఉండాలి. మీరు అలాంటి ఆలోచన చేయకండి. మీరు పైన లేదా కింద.. మీకోసం అష్ట దిశలు సక్రమంగా ఉండేలా నిర్మించుకొని వాసం చేయండి.
మా లే అవుట్ చూసి మార్పులు చెప్పండి. ప్లాట్లు చేసి నాలుగు నెలలైనా.. అమ్ముడు పోవడం లేదు. రోడ్లు కూడా వేశాం.
– వి. సుమలత, కొల్లూరు
అందమైన బ్లాక్ టాప్ (డాంబరు) రోడ్లు వేశారు. కానీ, మీరు పంపిన లే అవుట్లో మీ స్థానిక నార్త్ దిశకు, మీ ప్లాటింగ్ విధానానికి సంబంధమే లేదు. ముఖం కనిపించని శరీరం, బలిష్ఠమైన రూపం ఫొటోగా తీసి పెడితే.. అది ఆ వ్యక్తికే నచ్చదు కదా! ఆ శరీరం అతనిదే అయినా కూడా! మీలే అవుట్ ప్లాటింగ్ విధానం కూడా అలానే ఉంది. స్థలాలు – వీధులు – దిశలకు అమరినప్పుడే ఆ లే అవుట్‌కు ప్రాణం ఉంటుంది. ‘కట్నం భారీగా ఇస్తాను. రోబోను పెళ్లి చేసుకో!’ అన్నట్లు ఉంది మీ ప్లాటింగ్. మీరు చేయగలిగితే.. వీధుల విధానం మార్చండి. దిశలకు అనుకూలంగా లే అవుట్ తయారు చేయండి. లేదంటే, ఎకరం ఒక ప్లాటుగా చేసి అమ్మండి. కాదంటే మొత్తం లే అవుట్ మార్చండి.
మెట్లు మూస్తూ.. గ్లాస్‌తో ఎలివేషన్ చేసుకోవచ్చా? మాది తూర్పు రోడ్డు.
– సీహెచ్. మోహన్, మెదక్
ఎలివేషన్.. ఇంటినుంచి శాస్ర్తాన్ని వెలివేసేదిగా ఉండకూడదు. నివాసాన్ని అందంగా మార్చుకోవడం తప్పుకాదు. శాస్త్రంలో సౌందర్యం అనేది ఒక భాగం. సుందరీకరణ పేరిట ఉన్న బట్టలు ఊడబెరకకూడదు. ఇవ్వాళ గొప్పగా కడతారు.. అద్దాలతో అన్ని దిక్కులూ మూస్తారు. తలకు బిందె దిగేసి, ముఖం మూసి.. ‘అది అందం! అది హెల్మెట్‌గా ఉంటుంది!’ అంటే ఎంత విడ్డూరం. ఇవ్వాళ కోట్లాది రూపాయలతో నిర్మించిన పెద్దపెద్ద భవనాలు అలాగే ఉంటున్నాయి. అందం అటుంచితే.. అందులో ప్రాణమే ఉండదు. చచ్చిన శరీరాలలాగా, భవనాలు ముసుగువేసి.. ‘అది గొప్ప ఎలివేషన్’ అంటున్నారు. కార్పొరేట్ నిర్మాణాల్లో అదే పెద్ద దోషం అవుతున్నది. మీరు తూర్పు – ఆగ్నేయం మెట్లు మూసేలా అద్దాల ఎలివేషన్ కిందినుంచి కట్టుకుంటూ పోతే.. ఆగ్నేయం మూతపడుతుంది. పెళ్లి కూతురు పట్టుచీర కట్టుకున్నట్టుగా ఉండాలి.. ఎలివేషన్ అంటే. మనిషికి గోనెసంచి దిగేసినట్టు మాత్రం ఉండకూడదు. చక్కగా గాలి – వెలుతురు వచ్చేలా ఉన్న సహజసిద్ధ నిర్మాణాలు సజీవ భవనాలుగా వర్ధిల్లుతాయి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | మా ఆవిడను ఎప్పుడూ అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.. దీనికి వాస్తు దోషాలే కారణమా?
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?