ఆంధ రాష్ట్రంలో తెలంగాణను కలిపిన తర్వాత సుమారు పన్నెండేండ్ల పాటు సాగిన అన్యాయాలు, అక్రమాలు, అణచివేతలు, నిధుల దోపిడీల గురించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి తెలంగాణవాదులు తీసుకువెళ్లారు. కానీ, ఆమె పట్టించుకోకపోవడంతో, ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ
దోపిడీలు, అణచివేతలు, అన్యాయాలు నిరాటంకంగా కొనసాగాయి. 1969 నుంచి 2000 దాకా ఎంత నిధుల మళ్లింపు జరిగిందో, తర్వాత కాలంలో అంతకు రెట్టింపు జరిగింది. ప్రభుత్వ గణాంకాలే అందుకు సాక్ష్యం.
హైదరాబాద్ ఆదాయం, ఈ నగరానికి పెట్టిన ఖర్చులను గమనిస్తే ఆంధ్ర పాలకులు ఈ సుందర నగరాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నిధుల దోపిడీ గురించిన గణాంకాలను ఈ వ్యాసంలో పొందుపరిచాను. అవి చూస్తే, 2003-2007 మధ్యలో ఆంధ్రకు, రాయలసీమకు ఎన్ని కోట్ల రూపాయలను తరలించారో మనకు తెలుస్తుంది.
నాలుగు సంవత్సరాల్లో దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా దోపిడీ చేయగలిగిన రాజకీయ బకాసురులు యాభై రెండున్నరేండ్ల పాలనలో ఈ లెక్కన దాదాపు రూ.20 లక్షల కోట్ల తెలంగాణ నిధులు మాయం చేసి ఉంటారని అంచనా. ఆ రోజుల్లో తెలంగాణ, హైదరాబాద్ ఆదాయంలోంచి ఈ ప్రాంతంలో అప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే, బహుశా ఈ రోజుకీ ఉమ్మడి రాష్ట్రం ఉండేదేమో! దురాశ దుఃఖమునకు చేటు! పైగా హైదరాబాద్‌ను తామే కట్టామని, ప్రపంచ పటంలో నిలిపామని గొంతు చించుకుంటూ, గుండెలు బాదుకునే వాళ్లకి ఈ లెక్కలు సరిపోతాయా నిజాలేమిటో గ్రహించడానికి?
నిజానికి రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ కొలమానాల్లో భాష అనేది లేదు. భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలు, వాటి కంటే ముఖ్యంగా ఆర్థికాంశాలు కీలకమైనవి. 1953 నాటికి 120 కోట్ల రూపాయల వార్షికాదాయం ఉన్న తెలంగాణను 22 కోట్ల ఆదాయమున్న ఆంధ్ర రాష్ట్రంలో కలిపితే, తెలంగాణ ప్రాంతం ఆర్థిక దోపిడీకి గురవుతుందని ఊహించిన ఫజల్ అలీ ఈ సంపన్న రాష్ర్టాన్ని ప్రత్యేకంగానే ఉంచాలని, ఆంధ్రతో కలపవద్దని సిఫారసు చేశారు. ఆయన అనుమానాలే నిజమయ్యాయి. ఆవురావురుమంటున్న వాడు కంచంలోని అన్నమంతా తినేశాడు! ఇప్పుడు తెలుస్తోంది ఎవరి సొమ్ము ఎవరు మింగారో. నాలుగేండ్లలో ఆంధ్ర, రాయలసీమ ఆదాయం కేవలం రూ.17,270 కోట్లు, వారి ఖర్చు మాత్రం రూ.25,794 కోట్లు. హైదరాబాద్‌ను కలుపుకొని తెలంగాణ జిల్లాల ఆదాయం రూ.54,751 కోట్లు. అయితే, ఇక్కడ వెచ్చించిన ఖర్చు మాత్రం 27,059 కోట్లు. అంటే ఏటా సుమారు సగం తెలంగాణ నిధులు వలస పాలకుల దోపిడీకి గురయ్యాయి.
నిజానికి తెలంగాణ జిల్లాల మీద ఖర్చు పెట్టామని ఆంధ్ర పాలకులు చూపించిన లెక్కల్లో కూడా నిజం లేదు. వారు అంత డబ్బు ఈ ప్రాంతానికి వెచ్చిస్తే అర్ధ శతాబ్దం పాటు మొత్తం 9 జిల్లాలు ఎందుకు వెనుకబడి ఉండిపోయాయి? ఈ ఆదాయం కాక, కేంద్ర నిధులు ఈ వెనుకబడ్డ జిల్లాల పేరు చెప్పి తెచ్చుకున్నవి కూడా ఆంధ్ర పాలకుల అక్రమ, అవినీతి సొమ్ముగా మారిపోయింది. వారి 58 ఏండ్ల పాలనలో ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ఉమ్మడి ఆదాయంలో తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ కలిపి 75.95-76.72 శాతమైతే, ఆంధ్ర, రాయలసీమ వారి ఆదాయం 23.28-25.65 శాతం మాత్రమే ఉండింది. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ అధికారిక గణాంకాలే!
ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, వారు ఈ ఆరు దశాబ్దాల్లో ఎంత దోపిడీకి గురై, వెనుకవేయబడ్డారో! నిజానికి ఈ తరలించిన తెలంగాణ నిధులు ఆంధ్ర, రాయలసీమ సామాన్య జనాల అభివృద్ధికి ఉపయోగపడినా తెలంగాణ ప్రజలు సంతోషించేవారు. ఆంధ్ర ప్రాంతంలో ఇన్ని కోట్లతో ఒక చక్కటి నగరం, పరిశుభ్రత, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించగలిగేవారు ఆంధ్ర పాలకులు. కానీ, వారికి ఆ ప్రాంతం మీద, అక్కడి సామాన్య ప్రజల మీద ఏ మాత్రం అభిమానం లేదనీ, పూర్తి స్వార్థపరత్వంతో వారిని నిర్లక్ష్యం చేశారనీ 1953 నుంచే రుజువైంది. ఈ నాటికీ బీహార్ ప్రజల లాగా ఆంధ్ర ప్రజలు హైదరాబాద్‌కు కూలీకి వస్తారంటే, ఆ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. 11 సంవత్సరాల్లో తమ రాష్ర్టానికి ఒక చిన్న రాజధాని కట్టలేని దద్దమ్మలు వారి నాయకులు! పైగా 1591లో అన్ని హంగులతో నిర్మింపబడిన అద్భుత నగరం హైదరాబాద్ వారి వల్ల అభివృద్ధి చెందిందని గప్పాలు కొడతారు. భూ కబ్జాలు చేసి వారి వ్యాపారాలు- స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, హాస్పిటళ్లు స్థాపించుకొని స్థానికులను దోచుకున్నారు తప్ప హైదరాబాద్‌కు వారు అర్ధ శతాబ్ది పాలనలో ఒరగబెట్టిందేమీ లేదు. సంపద పోగేసుకొని, వనరులు దోచుకొని, హైదరాబాద్ ఆదాయంలో ఈ నగరం కోసం వెచ్చించిన ఖర్చు పైన టేబుల్లో చూశాం కదా! మరి, ఒక నగరాన్ని ఇంత అభివృద్ధి చేయగలిగిన సమర్థులైతే 1953లో కర్నూలును ఎందుకు రాజధానిగా మలచలేదు? 2014లో 29 పల్లెలలో 34 వేల ఎకరాల వ్యవసాయం నాశనం చేసి గొప్ప రాజధాని అమరావతిని నిర్మిస్తామని చెప్పిన మాటేమైంది? ఆ ప్రాంతం ఇంకా మీటర్ల లోతు నీళ్లల్లో ఎందుకు ఉంది? ఆంధ్ర ప్రజలారా, ఆలోచించండి.

ఇంక తెలంగాణ నిధులు నిశ్శబ్దంగా ఆంధ్రకు తరలిపోయాయి కాబట్టి, సామాన్య జనాలకు వాటి గురించి తెలియలేదు. విద్యావంతులైన యువతకు గట్టిగా తగిలిన దెబ్బ ఉద్యోగాల విషయంలో. గుంటూరులో ఒక్క తమిళుడికి ఉద్యోగం ఇచ్చారన్న నెపంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభించిన ఆంధ్ర నేతలు, తాము మాత్రం తెలంగాణలో వేల ఉద్యోగాల దోపిడీకి పాల్పడ్డారు. పరీక్షల నిర్వహణలోనూ, మార్కులు వేయడంలోనూ వివక్ష చూపించి, అత్యధిక ఉద్యోగాల్లో ఆంధ్ర వారిని నియమించారు. వారి నిరసనలను చూసి 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 610 జీవో విడుదల చేసి గిర్గ్లానీ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కమిషన్‌ను నియమించారు. ఆయన నిబద్ధతతో పని చేసి రిపోర్ట్ సమర్పించినా, అది కంటితుడుపు చర్యగా మిగిలిందే గానీ అమల్లోకి రాలేదు.
గిర్గ్లానీ గారు ఎంత ఉత్సాహంతో పనిచేశారంటే, ఆ రిపోర్టు తయారైందని చెప్పగానే ఆనందరావు తోట గారు, నేను వారింటికి వెళ్లాం. ఒక రోజు లంచ్ తర్వాత మూడు గంటలకు వెళ్లాం. రాత్రి దాకా అవుతుందని ఆశించిన ఆయన ఆ రిపోర్టును మరునాడు సాయంత్రం దాకా ఉత్సాహంగా వివరించారు. అంత నిబద్ధతతో పని చేసినా, ఉద్యోగాల విషయంలో తెలంగాణకు న్యాయం జరగలేదు. ఎందుకంటే, 1985లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నియమించిన ఆ కమిటీ రిపోర్టు వచ్చేటప్పటికీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తెలంగాణ బద్ధ వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నారు. ఆ రిపోర్టు డస్ట్‌బిన్‌లోకి, మిగతా ఉద్యోగాలు ఆంధ్రవారి జేబుల్లోకి వెళ్లిపోయాయి.

2014 దాకా 57 ఏండ్లలో సమైక్యత పెరగకపోగా, వ్యతిరేకత పెరిగింది, ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య. దురాశాపరులైన ఆంధ్రులకు కృతజ్ఞతాభావం ఇసుమంతైనా తెలంగాణ వాసుల పట్ల లేకపోవడం, తమని దోపిడీ చేసిన ఆంధ్రుల పట్ల ఈ ప్రాంతం వారి ఏహ్యభావం ఈ వైరానికి ముఖ్య కారణాలు. చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, భాషా భేదాలు ఉన్నా, పై రెండు కారణాలు లేకపోతే కనీస సమైక్యత అయినా వచ్చి ఉండేదేమో! కానీ, రెండు ప్రాంతాల వారి వ్యక్తిగత సంస్కారం వేరవడంతో పాలునీళ్లలా కలవాల్సిన వారు నీళ్లు, నూనెలా ఉండిపోయారు. ఆంధ్ర పాలకుల కథ అదీ, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల వ్యథ ఇదీ!
– కనకదుర్గ దంటు
89772 43484