బాపూ.. రేపు తెలంగాణ సాధన కోసం మీరు ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అంటూ కఠోరమైన నిర్ణయాన్ని తీసుకొని నాడు మీరు చేపట్టిన దీక్ష తెలంగాణ బిడ్డల గుండెల్లో దావాగ్నిని రగిలించింది. ఊరూవాడ కదిలింది. ప్రతి తెలంగాణ బిడ్డ వీర కిశోరమై విజృంభించిన అద్భుత ఘడియలవి. తెలంగాణ త్యాగ గుణం తెలియనిది కాదు. తెలంగాణ ఆగ్రహజ్వాల ఢిల్లీ కోట గోడలను తాకింది. దీంతో తెలంగాణ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత ఎంత కాలయాపన చేసినా, మీ నాయకత్వంలో ప్రజలు ఉద్యమిస్తుండటంతో కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయక తప్పింది కాదు. ఇది జగమెరిగిన చరిత్ర. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన ఘట్టం అది.
తెలంగాణ సాధనలో, తెలంగాణను నిలబెట్టడంలో మీరు ఎన్ని కష్టనష్టాలకు ఓర్చారు. ఎన్ని నిందలు మోశారు. ఒకే ఒక్కడిపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు. అయినా అసహాయ శూరుడిలా నిలబడి పోరాడారు. అటు జిత్తులమారి నక్కలు, ఇటు అమాయక ప్రజలు.. మధ్యలో మీరు.. కుట్రలకు భయపడలేదు, ప్రలోభాలకు లొంగిపోలేదు, కాడి దించలేదు. గమ్యం వరకు చేరినవాడే బంటు అంటూ చేసి చూపించారు. ధనబలం చెలామణి అవుతున్న ఈ కాలంలో జన బలం అంటే ఏమిటో చూపించారు. హింసాయుత పోరాటాలు తప్ప, మరే ప్రత్యామ్నాయం లేదని నమ్మేవాళ్లకు శాంతిబాటను చూపించి గెలిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచారు. తెలంగాణ సాధించి, అధికారానికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎన్ని కుట్రలు.. ఒక వర్గం మీడియా, గిట్టని పక్షాలు, ఇంటి దొంగలు… ఇందరి మధ్య తెలంగాణను నిలబెట్టి, అభివృద్ధి బాటలో నడిపించడం మీకు మాత్రమే సాధ్యమైంది. తెలంగాణను నిలబెట్టడమే కాదు, ప్రగతి బాటలో నడిపించారు.
ఎన్ని చేశావు బాపూ.. అసలు ఏది చేయలేదని? ఏ వర్గానికి చేయలేదని? మీ పాలనలో బాగుపడని వర్గమున్నదా? బాగుపడని ప్రాంతమున్నదా? గొర్రెల కాపరులకు గొర్రెలు ఇచ్చారు. మత్స్యకారులకు చెరువులు నింపి, చేపలు వేసి చేతపెట్టారు. చేనేతకారుల చేతికి పని కల్పించారు. కులవృత్తులవారిని గుర్తించి ఆదుకునేవారు ఈ కాలంలో ఎవరున్నారని? అర్ధాకలితోనైనా ఉన్నవారు మీ పాలనలో ఒక్కరంటే ఒక్కరున్నారా? హాస్టల్ విద్యార్థులకు తిండి కొలిచి పెట్టడమేమిటని, కడుపునిండా పెట్టాలని ఇన్నాళ్లు ఒక్కరైనా ఆలోచించారా? వ్యవసాయం దండుగ అనే నాయకులు దేశమంతా ఉన్నారు. కానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించే హృదయం, మెదడు ఈ దేశంలో మీకు తప్ప ఏ నాయకుడికైనా ఉన్నదా? రైతుబంధు, రైతు బీమా ఇవ్వడమే కాదు, పంటపొలాలకు నీళ్లిచ్చారు. రెప్పపాటు కోత లేని నిరంతర కరెంటు ఇచ్చారు. గంగమ్మను పల్లం నుంచి ఎత్తుకు నడిపించారు. పంటపొలాలకు సాగునీళ్లు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీళ్లు ఇచ్చారు. పొద్దున లేవగానే మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని మైళ్లకొద్ది నడిచిపోయే కష్టాన్ని తప్పించారు. సామాన్యుడికి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో దేవాలయాలు కూడా వెలిగిపోయాయి. యాదగిరిగుట్ట నవ్యశోభ ఇందుకు ఉదాహరణ. పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. నిజానికి తెలంగాణ మొత్తాన్ని ఒక టూరిస్టు కేంద్రంగా మార్చే దిశగా మీ సర్కార్ అడుగులు వేసింది.
వీటన్నింటినీ మళ్లీ మళ్లీ చెప్పుకోవలసిన సందర్భం వచ్చింది. ప్రతి ఆడపడచు మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. పేదల ఇంట పెళ్లయితే, కల్యాణలక్ష్మి అంటూ దీవించారు. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ రూపంలో కావలసినవన్నీ సమకూర్చారు. పండుగకు కొత్త చీర కట్టుకోవాలని బతుకమ్మ చీరలు కట్నం పెట్టారు. పేదల కన్నీళ్లు తుడిచే ఇటువంటి నాయకుడు ఎక్కడైనా ఉంటారా? మీరు ఎవరి కన్నీళ్లు తుడువలేదని? మీ పరిపాలనా సంస్కరణలు తరతరాలుగా గుర్తుండిపోతాయి. జిల్లా కేంద్రానికి పోవాలంటే, ఒక రోజు పట్టే కాలం ఇప్పుడు లేదు. ప్రజల చెంతకు పరిపాలన వచ్చి చేరింది. ప్రతి పల్లెటూరి పేద కూడా చిటుక్కున జిల్లా కేంద్రానికిపోయి పనులు చేసుకొని వస్తున్నాడు.
గిరిజనుల తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. ‘మా తండాలో మా పాలన’ అని ఇప్పుడు వారు గర్వంగా చెప్పుకొంటున్నారు. దళితులు, గిరిజనులు, బీసీల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల స్థాయి చదువును ఉచితంగా పొందడం చరిత్రలోనే ఎక్కడా చూడలేదు. బడిపిల్లలకు చదువు, యువతకు చేతినిండా పని, వృద్ధులకు భరోసా, ఆడపడచులకు ఆత్మగౌరవం.. ఇంకా కావలసిందేమున్నది. వలసలు ఆగిపోయాయి. కుటుంబాలు కలుసుకున్నాయి. సమాజం సంతోషంగా ఉన్నది. జీవన ప్రమాణాలు పెరిగాయి. భూమి విలువ పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడింది. జిల్లా కేంద్రాలూ సాఫ్ట్వేర్ హబ్‌లుగా మారాయి.
ఒకప్పుడు ఆకలిచావులకు, ఎన్కౌంటర్లు, సంక్షోభానికి నిలయమైన తెలంగాణ- అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఎంత గొప్ప విషయం. దేశ పటంలోనే కాదు, ప్రపంచ అభివృద్ధి పథంలోనూ తెలంగాణ మెరిసిపోయింది. ఇది అందరికీ సాధ్యం కాదు. మన రాష్ర్టానికి ఎన్ని అవార్డులు దక్కాయో లెక్కలేదు. ఏ రంగంలోనైనా తెలంగాణ వెనుకబడిపోయిందా? ఇవాళ తెలంగాణ ఎందరో డాక్టర్లను దేశానికి అందిస్తున్నది. ఇంజినీరింగ్ విద్యాప్రమాణాలు పెంచడంలోనూ మీరు పడిన తపన మరొకరికి సాధ్యమా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్ని లక్షలు లభించాయో లెక్కించతరం కాదు.
ఎవరి కోసమని ఈ కష్టాలు పడ్డారు? ఎవరి కోసమని ఇన్ని నిందలు మోశారు? ఎవరి కోసమని నిప్పుల మీద నడిచారు? ఎవరి కోసమని రాత్రింబవళ్లు మీ మెదడును కరగదీసుకొని ఆదర్శనీయమైన, శాస్త్రీయమైన పథకాలు రచించారు, అమలు చేశారు. నా అనే వాళ్లు నిన్ను కాదనుకున్నప్పుడు, నీవెంత బాధపడ్డావో కదా బాపూ. ఈనగాచి నక్కల పాలుచేసినట్టు.. తెలంగాణను పరాయి పాలకుల చేత పెట్టవలసి వస్తున్నదని ఎంత క్షోభించి ఉంటారు.
ఎలా జరిగిందో ఏమో కానీ, ఒక మహాపరాధం జరిగింది. తరతరాలు నెత్తిన పెట్టుకొని కొలువాల్సిన మిమ్మల్ని కాదనుకొని జనం ఒక మాయలమారిని నమ్మారు. పరాయి కుట్రలను తెలుసుకోలేకపోయారు. తమ వేలుతోనే తమ కన్ను పొడుచుకున్నారు. ఎంత దారుణమో, ఎంత విషాదమో.. ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. తెలంగాణ జనం స్వేదంతో నిర్మించిన కాళేశ్వరాన్ని కుప్ప చేశారు. చెరువులను నింపడం లేదు. ఉప్పొంగే నదుల జలాలు ఆంధ్రకు తరలిపోతున్నాయి. మన సాగునీటి శాఖలో పరాయి పాలకుల పెత్తనం నడుస్తున్నది. ఆనాడు పరాయి పాలకులది ప్రత్యక్ష పాలన అయితే, ఇప్పుడు పరోక్ష పాలన. తెలంగాణ నిధులు ఇక్కడి ప్రజలకు చేరడం లేదు. మన నీళ్లు మన పొలాలకు పారడం లేదు. మన నియామకాలు పైరవీకారుల పాలయ్యాయి. మళ్లీ రైతుల కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు లేవు, కరెంటు లేదు. అడిగితే చెప్పేవాడు లేడు. మనోడిని మనం అడుగుతాం కానీ, పరాయి పాలకుడిని ఏమని అడుగుతాం? అన్నదాతలు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఆత్మహత్యలు సాధారణమైపోయాయి.
బడిపిల్లలు కడుపునిండా తినాలన్న మీ కలలు ఏమయ్యాయి బాపూ..? బడుగు, బలహీనవర్గా ల కోసం మీరు పెట్టించిన గురుకులాలు ఇప్పుడు పాడుబడిపోతున్నాయి. అన్నానికి దిక్కులేక పేద పిల్లలు కన్నీళ్లు పెడుతున్నారు. గొర్రెల కాపరులు, మత్స్యకారులు.. సబ్బండ వర్గాల ప్రజలు దు:ఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. మళ్లీ పొట్టకూటి కోసం దేశాలు పట్టుకతిరిగే రోజులు దాపురించాయి. ఊర్లన్నీ మళ్లీ దీనంగా మారాయి. రైతులకు భరోసా లేదు. రైతు మరణిస్తే ఆ కుటుం బం ఆగమైపోవడమే తప్ప, ఆదుకునే దిక్కు లేదు. వృద్ధులకు నెలనెలా పింఛన్ వస్తుందన్న ధీమా లేదు. తెలంగాణ ఏర్పడినాక సాధించినవ న్నీ ఒక్కటొక్కటే కనుమరుగవుతున్నాయి. తొట్లె లో శిశువు మొదలుకొని అంతిమ సంస్కారాల వరకు మనిషి అవసరాలన్నీ తీర్చే మీలాంటి నా యకుడు మాకు మళ్లొకరు దొరకరని అర్థమైంది.
బాపూ.. ఎప్పుడూ మా బాగు కోసం తాపత్రయపడేది మీరు తప్ప, మరొకరు లేరని బాగా అర్థమైంది. మీరు లేని ఈ తెలంగాణ లేదు. మీ పరిపాలన ఉంటేనే తెలంగాణ లేచి నిలబడగలదు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దక్కాలన్నా, మేం ఆత్మగౌరవంతో బతకాలన్నా మీరు మళ్లీ రావాలి. మా కన్నీళ్లను తుడవాలి. మీరు రావడమంటే మళ్లీ తెలంగాణ రావడమే.
మీ దీక్షా దినం సందర్భంగా ఇప్పుడు మేమే దీక్ష పూనుతాం. మళ్లీ మీ పాలన తెచ్చుకుంటామ ని ప్రజా దీక్ష పూనుతాం. మళ్లీ తెలంగాణను పునరుద్ధరించుకుంటాం. ఆనాటి దీక్ష మీది. తెలంగాణను ప్రగతిపథంలో పరుగులు పెట్టించిన పరిపాలనా దక్షత మీది. కంటికిరెప్పలా మమ్మల్ని కాపాడుకునే సంరక్షకులు మీరే. దీక్ష మీది, దక్షత మీది, మా సంరక్షకులు మీరే. ఇప్పుడిక మా సంరక్షకుడి పాలన తెచ్చుకోవడానికి మేం దీక్ష పూనుతాం.