హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీవోపై విచారణ డిసెంబర్ 12న కొనసాగాల్సి ఉన్నది. అంతలోనే హడావుడిగా మొత్తం రిజర్వేషన్లను మళ్లీ 50శాతంలోపు కుదిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 46ని విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. కోర్టు తేల్చకముందే కొత్తగా జీవోను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? కోర్టు కొట్టేస్తుందని భావిస్తే ముందే ఎందుకు జీవో 9ని జారీ చేసింది? కేవలం బీసీలను వంచించేందుకేనని బీసీ సంఘాలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నా రు. కోర్టుపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తుండడంపై నిప్పులు చెరుగుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ పూర్తిగా మౌనం వహించడం, పార్లమెంట్‌లోనూ ప్రశ్నించకపోవడం ఆ పార్టీ వంచనకు నిదర్శనమని చెప్తున్నారు. అడుగడుగునా కాంగ్రెస్ సర్కారు బీసీలకు తీరని ద్రోహాన్ని తలపెట్టిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. అసెంబ్లీలో చేసిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకముందే అసెంబ్లీని ప్రోరోగ్ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత అందుకు అనుగుణంగా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేస్తూ, బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ జీవో 9 జారీ చేసింది. వెనువెంటనే స్థానిక సంస్థల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించింది. జీవో 9 అమలును సవాలు చేస్తూ సామాజిక కార్యకర్తలు, పలువురు రాజకీయ నేతలు, కుల సంఘాల నాయకులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని, ఆయా కేసులలో తమ వాదనలు కూడా వినాలంటూ కాంగ్రెస్, సీపీఐ నాయకులతోపాటు, బీసీ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా 30 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన పిటిషన్లతోపాటు అన్ని ఇంప్లీడ్ పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో జీవో 9 అమలుపై తాత్కాలికంగా స్టే ఇచ్చింది. పూర్తిగా రద్దు చేయలేదు. కోర్టులో వాదనలే పూర్తిగా మొదలు కాలేదు. డిసెంబర్12న వాదనలు కొనసాగాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ముందుగానే రిజర్వేషన్లపై యూటర్న్ తీసుకున్నది. సుప్రీం నిబంధనలకనుగుణంగా 50శాతం సీలింగ్‌ను అనుసరిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు జీవో 46 విడుదల చేసింది. వెంటనే ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చే యడంతోపాటు షెడ్యూల్ కూడా ప్రకటించింది. హై కోర్టులో 12న జీవో 9పై విచారణ ఉండగా, అంతకు ముందురోజే మొదటిదశ పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించడం గమనార్హం. ఈ క్రమంలో కాంగ్రె స్ తీరుపై బీసీ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. జీవో 9పై ఎటూతేలకముందే జీవో 46 విడుదల చేసి ద్రోహం చేశారని భగ్గుమంటున్నాయి.
బీసీ రిజర్వేషన్ల అంశంపై కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. కుల సర్వే చేసిన సమయంలో, అసెంబ్లీలో బిల్లులు చేసిన సందర్భంలో, అవి అమల్లోకి వచ్చినట్టే చెప్పుకున్నారు. బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకముందే అనుకూల బీసీ, కుల సంఘాల నేతలతో సత్కారాలు, సన్మానాలు చేయించుకున్నారు. అటు తర్వాత బిల్లులను ఆమోదించాలని ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు… ధర్నాలకు ది గారు. తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని రా హుల్‌గాంధీ నుంచి మొదలు రాష్ట్ర నేతల వరకూ ఊ దరగొట్టారు. జీవో 9పై హైకోర్టు స్టే విధించగానే డి ప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సహా పలువురు మంత్రులు సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి హడావుడి చేశా రు. హైకోర్టులో కొనసాగిన విచారణకు సైతం మం త్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ శ్రీనివాసరావు, సీనియర్ నేతలు హనుమంతరావు, కేశవరావు హాజరై ఫొటోలతో ఆర్భాటం చేశారు. కానీ నేడు జీవో 9పై ఎటూ తేలకుండానే జీవో 46 జారీ చేసి, బీసీలకు తీరని ద్రోహాన్ని తలపెడితే కాంగ్రెస్‌లోని ఏ నాయకుడు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.
రిజర్వేషన్లపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఇప్పటికీ నోరుమెదపడం లేదు. రిజర్వేషన్ల కుదింపుపై మౌనం వహించడం చూస్తుంటే పార్టీ చిత్తశుద్ధి ఏంటో తేటతెల్లమవుతున్నదని బీసీలు మండిపడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రచారాన్ని మధ్యలో వదిలేసి మరీ తెలంగాణకు ఆగమేఘాల మీద వచ్చి.. బీసీ నేతలు, సంఘాలతో రాహుల్ భేటీ అయ్యారు. ఆ తర్వాత బీహార్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కూడా ఢిల్లీలోనూ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి కులగణన చేసి ఆదర్శంగా నిలిచామని చెప్పుకొచ్చారు. కానీ బీసీ బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నా వైపు చూ డలేదు. లోక్‌సభలో ఇండియా కూటమికి 290కిపైగా ఎంపీలు న్నారు. ప్రైవేట్‌గా బిల్లు పెట్టే అవకాశమున్నా రాహుల్‌గాంధీ పట్టించుకోవడం లేదు.
నిరుడు జనవరి 31తోనే గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. పాలకవర్గాల గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలు జిల్లాల మాజీ సర్పంచులు ఈ ఏడాది జూన్‌లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశా రు. వాటిని విచారించిన హైకోర్టు ధర్మాసనం జూన్‌లోనే ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిం ది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. వార్డుల విభజన, సర్పంచులు, వార్డు స భ్యుల రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి చేయాలని చె ప్పింది. గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఇటీవల వరకు ప్రభుత్వం దృష్టి సారించలేదు. హైకోర్టు గడువు ముగిసినా.. దాదాపు 2నెలల తర్వాత జీవో 46 ద్వారా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. రిజర్వేషన్లను కుదింపునకు ఇప్పుడు హైకోర్టు ఆదేశాలే కారణమని నెపం నెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుండడం కొసమెరుపు.
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 27 : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని.. దోపిడీ పాలన అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించిందని ధ్వజమెత్తారు. 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే బుధవారం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..

కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేశాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దుచేయాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ హామీ నిలబెట్టుకోని కాం గ్రెస్‌ను స్థానిక ఎన్నికల్లో ఖతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలను మోసగించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.