అది స్వరాష్ట్ర సాధనకు అందరికోసం ఒక్కడు నిలిచిన తరుణం. స్వాభిమాన రణం పతాకస్థాయికి చేరిన ఉద్విగ్న క్షణం. తెలంగాణ గుండెగోసను ప్రపంచానికి హోరెత్తించిన దీక్ష. కత్తుల వంతెనను నగ్నపాదాలతో దాటాల్సిన అగ్నిపరీక్ష. తల్లి విముక్తికి వీరపుత్రుని ఆరాటం. సత్యాహింసలే రథ చక్రాలై, గాంధేయమే గాండీవమై అభినవ పార్థుడు సాగించిన పోరాటం. తెలంగాణ నుదుటిరాతను మార్చిన దీక్ష. తెలంగాణను దరిచేర్చిన దీక్ష. కేసీఆర్ అనే మూడక్షరాలతో పెనవేసుకున్న దీక్ష. ఇది ఒకసమరం, ఇది ఒక ఉద్యమం. అటోఇటో తెగిపోవాలని తెగించి పోరాడిన దీక్ష. ఎన్నెన్నో పోరాటాలు ఏకమైన దీక్ష. ప్రాణాలను పణం ఒడ్డిన బక్కపలుచని దేహం.. ఉక్కు సంకల్పానికి తలవంచిన దేశం. అదొక గెలుపు పిలుపు. తెలంగాణ సాధనలో మూలమలుపు. దీక్షకు ముందు, దీక్షకు తర్వాత అని తెలంగాణ చరిత్రను రెండుగా విభజించిన రోజది.
ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు, బిల్లు లేదు, చట్టం లేదు. అందుకే అది తెలంగాణ గుండెల్లో గూడుకట్టుకున్న రోజు. ఆ రోజే తెలంగాణ ఆకాంక్ష నిప్పులకొండలా బద్దలైంది. ఆ ప్రకంపనలకు తల్లడిల్లిన ఢిల్లీ తెలంగాణ స్వరాష్ట్ర నినాదం ముందు మోకరిల్లిన రోజు.. మొక్కిన రోజు.. తెలంగాణ ద్రోహుల కాళ్లు వణికిన రోజు.. చరిత్ర తరాజు కాంటా తెలంగాణ వైపు తిరుగులేకుండా మొగ్గిన రోజు. ఆ తర్వాత మోసకారి అధిష్ఠానం ఎన్ని పిల్లిగంతులు వేస్తేనేం.. ఎన్నెన్ని అష్టొంకర్లు తిరిగితేనేం.. తెలంగాణ సత్యం రుజువైంది. తెలంగాణ స్వప్నం నిజమయ్యింది. కవి సినారె రాసినట్టుగా కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు కూడా అదే. అందుకే ఆ రోజు ఓ మరపురాని జ్ఞాపకం. ఏటేటా నవంబర్ 29న జరుపుకొనే ఓ తెలంగాణ పండుగ.
తెలంగాణ కథను పతాకస్థాయికి తీసుకువెళ్లి, గెలుపు తీరాలకు చేర్చిన ఆ దీక్ష జరిగి 16 ఏండ్లు అవుతున్నది. ఆ తర్వాత ఓ తరం మారింది. అప్పుడు పుట్టిన బిడ్డ ఇప్పుడు తన కౌమార స్వరం సవరించుకుంటున్నది. ఆ దీక్ష కలిగించిన ఉద్రేకం, ఉద్వేగం గురించి ఈ తరం తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ద్రోహులు మరోసారి చుట్టుముట్టారు. తెలంగాణ ఆత్మను చెరబట్టారు. త్యాగాలతో సాధించుకొని, సగర్వంగా నిలబెట్టుకున్న స్వరాష్ర్టాన్ని మాయదారి శక్తులు మోసకారి జిత్తులతో చీకట్లపాలు జేస్తున్నాయి. బానిస సంకెళ్లు తగిలిస్తున్నాయి. తెలంగాణ రూపురేఖలు మార్చి, అస్తిత్వానికే ఎసరు తెస్తున్నాయి. తెలంగాణను కాపాడుకోవాలంటే నిరంతర అప్రమత్తత తప్పదని దీక్షా దివస్ గుర్తుచేస్తున్నది. ఇది దీక్షా సమయం.. పరీక్షా సమయం. అందుకే అందరం, ముఖ్యంగా నవతరం ఈ దీక్షాదివస్ స్ఫూర్తితో మరో పోరుకు నడుం బిగించాలి. దుర్మార్గం మెడలు వంచేందుకు తెగించాలి. దీక్షా దివస్ స్మృతికి అదే నిజమైన నివాళి.