సిటీ బ్యూరో/ మణికొండ/బండ్లగూడ, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తతున్నది. 8 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో శుక్రవారం ఉస్మాన్ సాగర్ 12 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా హిమాయత్‌సాగర్ 9 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.20 అడుగులకు చేరింది.
ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 8వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దీంతో ఔట్ ఫ్లో 10668 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.95 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో దిగువకు 14,446 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్సాగర్లకు ఇంతస్థాయిలో వర్షపాతం నమోదైనట్లుగా జలమండలిశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.