జనగామ, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ అన్న కథ మారిపోయింది. ప్రస్తుతం ‘చేపా.. చేపా.. చెరువుకు ఎందుకు చేరలేదు? కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు!.. కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయలేదు?.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించలేదు’ అని చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించింది. రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు గడువు ముగిసినా టెండర్లు వేయలేదు. దీంతో సీజన్ ముగిసినా చేప పిల్లలు చెరువులోకి చేరలేదు. దీంతో జలపుష్పాల పంపిణీ కథ కంచికి చేరినట్లే కనిపిస్తున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
ఒకప్పుడు కరువుకు కేరాఫ్‌గా ఉన్న జనగామ జిల్లాలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరి జలాలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా తొణికిసలాడేవి. వీటిలో వదిలిన చేప పిల్లలతో తొమ్మిదేళ్లలో రూ. 500 కోట్ల సంపద నిరుపేద మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. అయితే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి ప్రధాన జీవనాధారంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం మత్స్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగా ప్రస్తుత సర్కారు నిర్ణయించుకున్న లక్ష్యంలో 50 శాతం సీడ్స్ మాత్రమే విడుదల చేస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేప విత్తనాలకు (చేప పిల్లలు) సంబంధించిన బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో సీడ్ పంపిణీకి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. అదను దాటినా జనగామ జిల్లాలో ఇంకా టెండర్ల ప్రక్రియ మొదలుకాకపోవడంతో చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 736 నీటి వనరుల్లో గత ఏడాది 129.80 లక్షల చేప పిల్లల పంపిణీ లక్ష్యంలో సగం కూడా పంపిణీ కాలేదు. ఈ ఏడాది 272.72 లక్షలు లక్ష్యంగా పెట్టుకొని ఆగస్టు 18 నుంచి ఈనెల 12 వరకు టెండర్లు ఆహ్వానించింది. గడువు ముగిసినా ఒక్క కాంట్రాక్టర్ కూడా సీడ్ పంపిణీకి ముందుకురాలేదు. దీంతో 187 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 18,183 మంది సభ్యులు ఇప్పుడు ఉపాధి దొరుకుతుందో? లేదో? అనే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
జనగామ జిల్లాకు చేప పిల్లలు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కాంట్రాక్టర్లకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు టెండర్లు వేసేందుకు ఉత్సాహం చూపలేదు. నీరు సమృద్ధిగా ఉండే ఆగస్టు మాసంలోనే చేప పిల్లలను వదిలితే దిగుబడి గణనీయంగా ఉంటుంది. ఈసారి సెప్టెంబర్ గడిచిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఈసారి ఉచిత చేప పిల్లల పంపిణీ కథ కంచికి చేరినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలతో ఆదాయం పొందిన మత్స్యకార్మికులు, సహకార సంఘాల సభ్యులు ఇప్పుడు వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకునే దిశగా పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.