Musi River | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుంచి, మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ ఉధృతంగా ఉరకలేస్తోంది. పురానాపూల్ వద్ద 100 ఫీట్ల రోడ్డును మూసివేశారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని కూడా రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి మూసేశారు. చాదర్‌ఘాట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్ జలమయం అయ్యాయి. మూసానగర్, శంకర్‌నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి అంబర్‌పేట వైపు వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు దారి మళ్లించారు.
ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. దీంతో సాయంత్రం 4 గంటల వరకు ఉస్మాన్ సాగర్ 11 గేట్లు ఏడు అడుగుల మేర ఎత్తి దిగువకు 7,986 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఆరు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది.