కేసముద్రం, సెప్టెంబర్ 26 : నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా తనయులను పెంచిన కన్నతల్లి వారి పాలిట కసాయిగా మారింది. ఒకరిని నీటి సంపులోకి తోసేసి చంపగా, మరొకరిని ఉరివేసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురానికి చెందిన ఉపేందర్ నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన శిరీషను ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వీరికి ముగ్గురు కుమారులు మనీష్‌కుమార్ (6), మోక్షిత్, నిహాల్ జన్మించారు. ఈ ఏడాది జనవరి 15న నిహాల్‌ను, ఈ నెల 24న మనీష్‌కుమార్‌ను ఎవరికీ అనుమాం రాకుండా చంపే సింది. పోలీసులు శిరీషను, ఉపేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపానని శిరీష ఒప్పుకున్నది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో పిల్లలను చంపిన తరువాత తాను ఆత్మహత్య చేసుకోవాలని శిరీష భావించి ఒకొక్కరిని చంపినట్టు సీఐ తెలిపారు.