హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ జేఏసీ పోరుబాట పట్టింది. కార్మికుల సమస్యలు, సంస్థ విలీనం, ప్రైవేటీకరణతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు తదితర తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నేడు సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వానికి, ఆర్టీసీ ఎండీకి శుక్రవారం సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు వెల్లడించారు. అదే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ 24న రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల ఎదుట ధర్నాలకు ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) పిలుపునిచ్చింది. రెండున్నరేండ్లుగా కార్మికుల సమస్యలపై సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు సమయం ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు.
కార్మికుల అశాంతి, అసంతృప్తి తీవ్ర రూపం దాల్చటం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను కలిసి ఆర్టీసీ సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, జేఏసీ ప్రతినిధులు ఏ ఆర్ రెడ్డి, జే రాఘవులు తదితరులు వినతిపత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, సీపీఐ పార్టీ ఆఫీసులో తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్టీ నర్సింహకు వినతిపత్రాలు ఇచ్చి ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, తమ సమస్యలపై సభలో చర్చకు వచ్చేలా పట్టుబట్టాలని కోరారు.
ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ బస్సులపై అంత ప్రేమ ఉం టే ప్రభుత్వ స్థలాలను వారికి ఇచ్చి కొత్త డిపోలు, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలి గానీ ఆర్టీ సీ డిపోలు, ఆస్తులను ప్రైవేట్‌కు కట్టబెట్టడం మానుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్ల పరిషారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తమను సమ్మె వైపు వెళ్లకుండా నివారించే చర్యలు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీనే మింగేయాలని చూస్తున్న ‘ప్రైవేట్ భూతాన్ని’ తరిమికొట్టేందుకు యూనియన్లకు అతీతంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది. ఆర్టీసీలకే ఎలక్ట్రిక్ బస్‌లను అప్పగించాలని, అందుకు తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ‘విద్యుత్ బస్సులు- ఆర్టీసీ, ప్రజలు, కార్మికులపై ప్రభావం’ అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ మనుగడకే ప్రమాదమని, బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ అన్నీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆర్టీసీలకు ఎలాంటి పాత్ర ఉండదని, ప్రతినెలా విద్యుత్ బస్సుల కంపెనీకి డబ్బులు చెల్లించడం మాత్రమే ఆర్టీసీ చేస్తుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసీ డిపోలో ఉన్న భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడాన్ని సీఐటీయూ వ్యతిరేకిస్తుందని చెప్పారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టి.. రెండేండ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల ఎదుట ధర్నాలకు ఎస్‌డబ్ల్యూఎఫ్ పిలుపునిచ్చింది.
డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ప్రజా రవాణాను నిర్వీర్యం చేస్తే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రజలపై అదనపు భారం వే యడాన్ని ఖండించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్య మాట్లాడుతూ ఏపీలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల పేరుతో ఇప్పటికే నా లుగు డిపోలు మూసివేయాలని నిర్ణయించగా, దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక వర్గం పోరాడుతున్నదని వివరించారు. తెలంగాణలో చేపట్టబోయే పోరాటానికి ఏపీ ఎస్‌డబ్ల్యూఎఫ్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌రావు, పీ రవీందర్‌రెడ్డి, సత్తిరెడ్డి, కృష్ణ, సుధాకర్, గీత, ప్రభాకర్, చంద్రప్రకాశ్, ఉపేంద్రాచారి, శ్రీనివాస్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
తమకు కొత్త డిమాండ్లు ఏమీ లేవని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినతిపత్రాలు అందజేసిన తర్వాత వారు మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం అనేకమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రభుత్వానికి స్పందించకపోగా, రోజురోజుకూ సంస్థను నిర్వీర్యం చేస్తున్నదని వారు మండిపడ్డారు. వేలాది ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను బలవంతంగా సంస్థపై నెట్టి, కార్మికుల ఉద్యోగాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కార్మిక ప్రయోజనాలను విస్మరించి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరిచి అడ్డగోలుగా ఆర్టీసీ డిపోలను, స్థలాలను ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.