అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం నుంచి ‘కాలరే ఎత్తరా..’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు. రామ్ మిర్యాల ఆలపించారు.
భారీ సెట్స్, విజువల్స్ నేపథ్యంలో మాస్ అప్పీల్‌తో ఈ పాట సాగింది. పవన్‌కల్యాణ్ తనదైన శైలి నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘ఎక్కే దిగే కిక్కులోనే దక్కేదేముంది..అరే సచ్చేదాక కిక్కే ఉండాలే..ఎక్కితోక్కేటోళ్లే వున్నా తగ్గేదేముందే.. అరే నెగ్గేదాక తిక్కే ఉండాలే..ఒక్కోమెట్టు ఇట్టే ఎక్కాలే.. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా’ అంటూ ఉత్తేజభరితంగా ఈ పాట సాగింది. ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ప్రాణం పెట్టి పనిచేశారని, ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కనబరిచారని దర్శకుడు హరీశ్‌శంకర్ చెప్పారు. ‘ఖుషి’ నాటి రోజులను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రవిశంకర్ యలమంచిలి పేర్కొన్నారు.