సామాజిక మాధ్యమాల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై తీవ్రంగా మండిపడింది. వారికి హెచ్చరికలు జారీ చేస్తూ గురువారం ఓ లేఖను విడుదల చేసింది. గత ఎనిమిదేళ్లుగా తనపై దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇన్నాళ్లు ఓపికతో భరించానని, ఇకపై ఇలాంటి చర్యల్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించింది. ‘8ఏండ్ల కిందటి ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. నేను ఎన్నడూ అనని పదాలను వండివార్చి నాపై అబద్ధపు కథనాలను రాస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గడిచిన 24గంటల్లో నాపై తీవ్రమైన దుష్ప్రచారం జరిగింది. ఇది ముమ్మాటికీ నా పరువుపై, నా వ్యక్తిగత గోప్యతపై జరుగుతున్న దాడిగానే నేను భావిస్తున్నా. నా జీవితం నాది.
దానిపై నిర్ణయాధికారాలు కూడా నావే. నా జీవితం ఎలా ఉండాలో మీరెలా నిర్ణయిస్తారు? ఇన్నాళ్లూ భరించాను. ఇక మౌనంగా ఉండలేను. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, కొన్ని మీడియా సంస్థలకు 24గంటల సమయం ఇస్తున్నా. నాపై రాసిన తప్పుడు కథనాలను వెంటనే తొలగించాలి. లేని పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. కోర్ట్ నోటీసులు జారీ చేస్తాను’ అంటూ ఘాటుగా స్పందించింది రష్మిక మందన్న.