హైదరాబాద్: ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్తానం తెరిచిన పుస్తకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇటీవల తనపై, పార్టీ పై కొందరు ఆరోపణలు చేశారని, ఎందుకు చేశారో? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో?. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పారు. గత పదేండ్లుగా కేసీఆర్ నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ముందున్న కర్తవ్యమని హరీశ్‌రావు చెప్పారు.
ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన వాళ్లం. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్లం. అందువల్ల మా సమయాన్ని దాని పైనే వెచ్చిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పారు.