న్యూఢిల్లీ: ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. తద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు బాధితులకు అందుతున్న సహాయక చర్యలను గురించి తెలుసుకోనున్నారు. అయితే ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైనప్పటికీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఏయే రాష్ట్రాల్లో పర్యటిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.
కాగా, ఉత్తరభారతంలోని జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో వర్షాలకు భారీగా కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు ఈ నాలుగు రాష్ట్రాల్లో 500 మందికిపైగా మరణించారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే జూన్ 20 నుంచి ఇప్పటివరకు 95 ఆకస్మక వరదలు, 45 మేఘ విస్పోటనాలు, 132 భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. దీంతో సుమారు 355 మంది మరణించగా, 49 మంది ఆచూకీ లేకుండా పోయారు. భారీ వర్షాలు రాష్ట్రంలో రూ.3,787 కోట్ల మేర నష్టం సంభవించింది. అదేవిధంగా వరదల ధాటికి మండి, శిమ్లా, కుల్లు, చంబా జిల్లాలతో సహా 1217 చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
ఉత్తరఖండ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు భారీ వర్షాలకు 79 మంది మరణించగా, 90 మంది గల్లంతయ్యారు. మరో 115 మంది గాయపడ్డారు. సుమారు 3953 పశువులు మృత్యువాతపడగా, 2835 పక్కా ఇండ్లు, రెండు ఇండ్లు నేలమట్టమయ్యాయి. అదేవిధంగా పంజాబ్‌లో గతంలో ఎన్నడూ చూడనివిధంగా ప్రకృతి కన్నెర్ర చేసింది. కుంభవృష్టి కురవడంతో 23 జిల్లాల్లోని 1900పైగా గ్రామాలు నీటమునిగాయి. ఇప్పటివరకు 43 మంది మరణించగా, 1.71 లక్షల హెక్టార్లలో పంట కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు కేంద్ర సర్కారు తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.