AP News | ఓ తల్లి చేసిన పని ఐదేళ్ల బాలిక ప్రాణం తీసింది. భర్తను బెదిరించేందుకు కూల్‌డ్రింక్ బాటిల్లో పురుగుల మందు తీసుకురాగా.. అది తెలియక తాగిన పాప మరణించింది. ఏపీలోని ఏలూరు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబు, అందర్వేదిగూడేనికి చెందిన కుమారిలకు ఎనిమిదేళ్ల కింద వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె రితిక (5) ఉన్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పొగాకు తోటకు చల్లే జిడ్డుమందును కూల్‌డ్రింక్ సీసాలో తెచ్చి ఇంటి వద్ద కంచె దగ్గర పెట్టింది. పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించి భర్తను తన దారిలోకి తెచ్చుకోవాలని భావించింది.
అయితే కంచె దగ్గర ఉన్న బాటిల్‌ను మంగళవారం చూసిన రితిక కూల్‌డ్రింక్ అని అనుకుంది. దీంతో ఎవరూ చూడకుండా తాగేసింది. ఆ తర్వాత కడుపు నొప్పితో విలవిల్లాడింది. బాలిక ఏడవడంతో గమనించిన కుటుంబీకులు బాలికను బుట్టాయగూడెం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది.